టీడీపీకి బిగ్ షాక్ :సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

  • Published By: venkaiahnaidu ,Published On : March 12, 2020 / 01:49 PM IST
టీడీపీకి బిగ్ షాక్ :సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

 ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి,మాజీ మంత్రి పాలేటి రామారావు,ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ,ఎమ్మెల్సీ పోతుల సునీత,ఆమె భర్త పోతుల సురేష్,తదితరులు ఉన్నారు.

ఈ సందర్భంగా కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు సీఎం జగన్ వైసీపీ కుండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎం జగన్ పథకాలు నచ్చే వైసీపీలో చేరినట్లు కరణం వెంకటేష్ సీఎంని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అయితే సీఎంని కలిసిన అనంతరం బలరాం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోగా,మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. 2024లో చీరాలలో వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తామని వెంకటేష్ తెలిపారు. వైసీపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని వెంకటేశ్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ చీరాల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులను మంచి మెజారిటీతో  గెలిపిస్తామని అన్నారు.

అయితే ఇతర పార్టీల నాయకులు ఎవరైనా వైసీపీలో చేరాలంటే వారు  ఆ పార్టీలోని పదవులకు రాజీనామా చేసి వైసీపీలో చేరాలన్న నిబంధన వైసీపీ పెట్టుకున్న విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు బలరాం వైసీపీ కండువా కప్పుకోనేది కూడా ఇందుకే. బలరాం వైసీపీ కండువా కప్పుకోవాలంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంది కనుక ఆయన వైసీపీ కండువా కప్పుకోలేదు.

కరణం బలరాం కూడా ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ,మద్దాలి గిరి మాదిరిగా బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనున్నారు. బలరాంకు కూడా  అసెంబ్లీలో వల్లభనేని వంశీ,మద్దాలి గిరిలకు కేటాయించినట్లుగా ప్రత్యేక స్థానంను స్పీకర్ కేటాయించే అవకాశం ఉంది. 

దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న కరణం బలరాం ఇప్పుడు వైసీపీ వైపు మళ్లడంతో టీడీపీకి పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కూడా కొన్నేళ్లపాటు బలరాం పనిచేశారు. అంతేకాకుండా గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గాలి బలంగా వీచినప్పటికీ ఆయన టీడీపీ తరపున చీరాల నుంచి పోటీ చేసి 17వేలకు పైగా మెజార్టీతో గెలిచారు.

ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఇప్పటికే వైసీపీ తీర్థంపుచ్చుకున్నారు. ఇప్పుడు కరణం బలరాం కూడా వైసీపీ గూటికి చేరడంతో జిల్లా రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కరణం బలరాంను వైసీపీ గూటికి తీసుకురావడంలో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

ప్రకాశం జిల్లా టైగర్ గా బలరాంకు పేరు ఉంది. 1977లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ బంగోలు వచ్చినప్పుడు కొంతమంది ఆమెపై దాడికి ప్రయత్నించినప్పుడు వారి నుంచి ఆమెను సేఫ్ గా జిల్లా దాటించినప్పుడు కరణం బలరాం పేరు దేశం మొత్తం మీడియాలో వినబడింది. ఇందిరాగాంధీ ఒక సందర్భంలో… తన మూడవ కుమారుడు బలరాం అని అన్నారు.

ఇందిరాగాంధీ ఆశిస్సులతో 1978 ఎన్నికలలో అద్దంకి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారి శాసనసభలో ప్రవేశించాడు బలరాం. అయితే ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరి 1986-94వరకు,2004-09వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్ లో బలరాం మంత్రిగా కూడా పనిచేశారు. 1999 నుంచి 2004వరకు బంగోలు ఎంపీగా బలరాం పనిచేశారు.