Amritpal Singh: అమృతపాల్ సింగ్ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ 6 ప్రశ్నలు

అమృత్‌పాల్ సింగ్‌‭ను ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని రోడె గ్రామంలో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు

Amritpal Singh: అమృతపాల్ సింగ్ అరెస్టుపై కాంగ్రెస్ పార్టీ 6 ప్రశ్నలు

amritpal singh and his supporters

Amritpal Singh: ఖలిస్థానీ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్‌ అరెస్టు మీద కాంగ్రెస్ పార్టీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆదివారం ఉదయం అతడిని అరెస్ట్ చేసినట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. దాదాపు 37 రోజుల తీవ్ర వేట అనంతరం ఎట్టకేలకు అతడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కాలయాపన, ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేసింది. 6 ప్రశ్నలను ప్రధానంగా సంధించింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‭దీప్ సింగ్ సూర్జేవాలా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రశ్నలను లేవనెత్తారు.

1. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఎవరు మద్దతు ఇస్తున్నారు? అమృతపాల్ సింగ్ తప్పించుకోవడానికి ఎవరు సహకరించారు?
2. ఇన్ని రోజులు అమృతపాల్ సింగ్ ఎక్కడ దాక్కున్నాడు?
3. అతడికి ఆశ్రయం ఇచ్చిన వారు ఎవరు? దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఇన్ని రోజులు అతడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పటి వరకు అలాంటి వివరాల్ని ఎన్ఐఏ, సీబీఐ, పంజాబ్ పోలీసులు ఎందుకు సేకరించలేదు?
4. పాకిస్తాన్ కానీ ఇతర దేశాల నుంచి అతడికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు? మరి వాళ్లెవరో ఎందుకు చెప్పడం లేదు? వాటిపై ఇప్పటికి తీసుకున్న చర్యలు ఏంటి?
5. దేశం లోపల, వెలుపల అమృతపాల్ సింగ్ కు మద్దతు ఇస్తున్నది ఎవరు? వారి మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?
6. కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్రంలో ప్రభుత్వంతో కానీ అమృతపాల్ సింగ్ కు ఉన్న సంబంధాలు ఏంటి?

ఈ ఆరు ప్రశ్నల్ని మోదీ ప్రభుత్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వేస్తున్నట్లు రణ్‭దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. కాగా, అమృత్‌పాల్ సింగ్‌‭ను ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని రోడె గ్రామంలో పట్టుకున్నట్లు పంజాబ్ పోలీసులు తెలిపారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఎటూ పారిపోయే అవకాశం లేకుండా చేసి, అదుపులోకి తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. అయితే తాను విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ వెళ్లలేదని, తన మద్దతుదారులను హింసిస్తున్నారని, అరెస్టుకు తాను భయపడటం లేదని చెప్పాడు. దీన్ని బట్టి చూస్తే 37 రోజుల పోలీసులు, కేంద్ర బలగాళ వేట ఒట్టిదేనని, అమృతపాల్ తనకు తానుగా వచ్చి లొంగిపోయాడని అంటున్నారు.