విశాఖ పరిసరాల్లో వైసీపీ నేతలు భూములు కొన్నారు : దేవినేని ఉమ

  • Published By: veegamteam ,Published On : December 18, 2019 / 09:58 AM IST
విశాఖ పరిసరాల్లో వైసీపీ నేతలు భూములు కొన్నారు : దేవినేని ఉమ

ఏపీకి మూడు రాజధానులు రావొచ్చేమో అంటూ అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ చేసిన సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజకీయవర్గాల్లో దుమారం రేపాయి. సీఎం జగన్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రాజధానుల వ్యాఖ్యలను కొందరు స్వాగతిస్తే.. కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. టీడీపీ నేతలు మాత్రం భగ్గుమంటున్నారు. 

ఏపీ రాజధానిపై సీఎం జగన్ వి ముందు నుంచి కుప్పిగంతులే అని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్.. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సూచన మేరకు వైసీపీ నేతలు విశాఖ పరిసరాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని దేవినేని ఉమ ఆరోపించారు. అందుకే.. సీఎం జగన్ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంశాన్ని ప్రస్తావించారని చెప్పారు. సీబీఐ విచారణ చేస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందన్నారు.

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు చివరి రోజున సీఎం జగన్ మాట్లాడుతూ.. ఏపీకి 3 రాజధానులు ఉండొచ్చు అంటూ చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిపై రాజధాని అమరావతికి భూమిలిచ్చిన రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సీఎంలు మారితే రాజధానులు మార్చేస్తారా అంటూ మండిపడుతున్నారు. అధికార పక్ష నేతలు మాత్రం సీఎం తీసుకున్న 3 రాజధానుల నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ గా విశాఖపట్నం, జ్యుడిషియల్‌ కేపిటల్‌ గా కర్నూలు, లెజిస్లేటివ్‌ కేపిటల్‌ గా అమరావతి ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.