ఆ జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేయడానికి, వైసీపీలో ఆధిపత్య పోరుని పరిష్కరించడానికి జగన్ మాస్టర్ ప్లాన్

  • Published By: naveen ,Published On : August 15, 2020 / 01:39 PM IST
ఆ జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేయడానికి, వైసీపీలో ఆధిపత్య పోరుని పరిష్కరించడానికి జగన్ మాస్టర్ ప్లాన్

ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని నియోజకవర్గాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఒకటి. పార్టీల కంటే వ్యక్తులు, సామాజికవర్గాలకు ప్రాధాన్యమిచ్చే ఈ నియోజకవర్గంలో మూడు దశాబ్దాలుగా పిల్లి సుభాష్ చంద్రబోస్ వెర్సస్ తోట త్రిమూర్తులు లేదా శెట్టి బలిజ వెర్సస్ కాపు సామాజికవర్గం అంటూ రాజకీయాలు సాగుతున్నాయి. సామాజికవర్గ సమీకరణాల దృష్ట్యా 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను మండపేటకు పంపించగా ఆయన స్థానంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం సమన్వయకర్త చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు రామచంద్రాపురం సీటు కేటాయించింది. మండపేటలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓటమి పాలవగా రామచంద్రాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుపై వేణు గోపాలకృష్ణ విజయం సాధించారు.



శిరోముండనం కేసు నుంచి తప్పించుకోవడానికేనా?
వైసీపీకి, వైఎస్ కుటుంబానికి విధేయునిగా ఉన్న పిల్లి సుభాష్‌ను ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్సీని చేసి, రెవెన్యూ మంత్రిగా అవకాశం కల్పించారు. అంతేకాకుండా డిప్యూటీ సీఎం పదవి కేటాయించారు. దీంతో నియోజకవర్గంలో రాజకీయాలు మంత్రి బోస్ వెర్సస్ ఎమ్మెల్యే వేణుగా మారిపోయాయి. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అనూహ్యంగా వైసీపీ కండువా కప్పుకున్నారు. మంత్రి సుభాశ్‌ చంద్రబోస్‌తో ఉన్న మూడు దశాబ్దాల రాజకీయ వైరానికి, ఎమ్మెల్యే వేణు రాజకీయ ఆధిపత్యం తోడవడంతో పాటు వెంకటాయపాలెం దళితుల శిరోముండనం కేసు నుంచి తప్పించుకోవడానికి తోట త్రిమూర్తులు పార్టీలో చేరారనే బహిరంగ ఆరోపణలు అప్పట్లో వినిపించేవి.

తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి:
అధిష్టానం మాటకు ఎదురు చెప్పలేక మంత్రి బోసు, ఎమ్మెల్యే వేణు తప్పనిసరి పరిస్థితుల్లో తోట త్రిమూర్తులతో కలిసినా కేడర్ మాత్రం మూడు వర్గాలుగానే కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే టీటీడీ చైర్మన్, ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్ చార్జి వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో మంత్రి బోస్, ఎమ్మెల్యే వేణుల సంయుక్త అనుచరుడు మేడిశెట్టి ఇజ్రాయేలు ద్రాక్షరామంలో తోట త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేశారు. ఈ దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పార్టీ ఆదేశాల మేరకు ఇరువర్గాల నాయకులు సైలంట్‌గా ఉన్నా కార్యకర్త ఇజ్రాయేలు విషయంలో చట్టం మాత్రం తన పని తాను చేసుకుంటూపోతోంది.



తోట త్రిమూర్తులకు కూడా త్వరలో పోస్టు:
రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ అవసరాల దృష్ట్యా అధిష్టానం పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను రాజ్యసభకు పంపించగా, ఆయన స్థానంలో జిల్లాలో ఖాళీ అయిన మంత్రి పదవిని రామచంద్రాపురం ఎమ్మెల్యే వేణు గోపాలకృష్ణకు కేటాయించారు జగన్‌. అమలాపురం లోక్‌సభతో పాటు మండపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలను తోట త్రిమూర్తులుకు అధిష్టానం అప్పగించింది. అంతేకాదు నియోజకవర్గంతో పాటు జిల్లాలోని బలమైన సామాజికవర్గానికి చెందిన తోట త్రిమూర్తులకు కూడా త్వరలో ఏదో ఒక నామినేటెడ్ పోస్టు కేటాయించడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చరిత్రలో నిలిచిపోనున్న రామచంద్రాపురం జిల్లా:
రామచంద్రాపురం నియోజకవర్గంలో మొదటి నుంచి శెట్టిబలిజ వెర్సస్ కాపు అంటూ రాజకీయాలు సాగుతున్నాయి. పిల్లి సుభాష్ చంద్రబోస్, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ ఇద్దరూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందడంతో కాపు సామాజికవర్గానికి న్యాయం చేయడానికైనా రానున్న రోజుల్లో తోటకు ఎమ్మెల్సీ ఇస్తారనే వాదన బలంగా వినిపిస్తోంది. అదే జరిగితే ఒక రాజ్యసభ, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ ఇలా మూడు పదవులు సాధించిన నియోజకవర్గంగా రామచంద్రాపురం జిల్లా చరిత్రలో నిలిచిపోవడం ఖాయమని పార్టీలో చర్చించుకుంటున్నారు. అదే సమయంలో జగన్ సామాజిక న్యాయం కూడా నియోజకవర్గ ప్రజలను ఆకట్టుకుంటుందని అనుకుంటున్నారట.



కొత్త పదవులు పాత విభేధాలను పరిష్కరిస్తాయా?
పెద్దల సభకు మాజీ మంత్రి సుభాష్ చంద్ర బోస్, ప్రభుత్వంలోకి జూనియర్ ఎమ్మెల్యే వేణు, పార్టీ బలోపేతానికి మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అంటూ ముఖ్యమంత్రి జగన్ వేసిన స్కెచ్‌తో నాయకుల ఆధిపత్య పోరుకు చెక్ పడుతుందని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారు. తోట త్రిమూర్తులు పార్టీని వీడిన తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి అష్టకష్టాలు పడుతున్న టీడీపీని భూస్థాపితం చేయడానికి జగన్ స్కెచ్ వర్కవుట్ అవుతుందని కొంతమంది వైసీపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకులను వరించిన కొత్త పదవులు పాత విభేధాలను పరిష్కరిస్తాయా లేదా? అనే అనుమానాలు కొందరిని వేధిస్తున్నాయి.

నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకు చెక్ పడేనా?
తమ రాజకీయ అవసరాలు లేదా ఎదుగుదల కోసం నాయకులు కలిసినంత మాత్రాన పదేళ్ళ పాటు నువ్వానేనా అంటూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్న కేడర్ కలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మాస్ లీడర్‌గా పేరు తెచ్చుకున్న తోట త్రిమూర్తులు తన సాధారణ స్వభావానికి భిన్నంగా వైసీపీలో చాలా సైలంట్‌గా ఉన్నా కార్యకర్తలు మాత్రం పాత గాయాలను మరచిపోలేక పోతున్నారట. పార్టీ బలోపేతం చేయడం తోట త్రిమూర్తులకు పెద్ద కష్టం కాకపోయినా కేడర్ అంతర్గత విభేదాలను ఎలా పరిష్కరిస్తారనేది ఆసక్తిగా మారిందట. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు అధిష్టానం వేసిన స్కెచ్ వర్కవుట్ అవుతుందో లేదో తేలాలంటే కొద్దికాలం ఆగాల్సిందే.