సింగపూర్ పోతే ఏం… చాలా దేశాలు వస్తాయి : బొత్స సత్యనారాయణ

  • Published By: chvmurthy ,Published On : November 13, 2019 / 12:06 PM IST
సింగపూర్ పోతే ఏం… చాలా దేశాలు వస్తాయి : బొత్స సత్యనారాయణ

రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టటానికి వస్తే వారిని స్వాగతించటానికి ప్రభుత్వం సిధ్దంగా ఉందని పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాష్ట్రాభివృధ్దికి దోహదపడే పాలసీని త్వరలోనే తీసుకువస్తాం అని ఆయన చెప్పారు. ఆ పాలసీ చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు దోపిడీకి తావులేకుండా ఉంచుతాం అని హామీ ఇస్తున్నానని అన్నారు.

అమరావతి స్టార్టప్‌ ప్రాజెక్టు నుంచి సింగపూర్‌ కన్సార్షియం  పరస్పర అంగీకారంతోనే తప్పుకుందని బొత్స అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించమని కోరితే కన్సార్షియం నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. అందుకే ప్రభుత్వంతో వారికున్న పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని చెప్పారు. రాష్ట్రానికి సింగపూర్ కంపెనీ రాకపోతే వచ్చిన నష్టం ఏమీ లేదని.ఎన్నో దేశాలు పెట్టుబడులు  పెట్టటానికి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడ నిజాయితీ ఉండి, ఎక్కడ వ్యాపారానికి అవకాశాలు ఉంటే అక్కడకు కంపెనీలు తరలి వస్తాయని బొత్స అన్నారు.

తప్పుడు ప్రకటనలు చేస్తూ, ప్రజలను మభ్య  పెట్టాలని చూస్తున్న చంద్రబాబునాయుడుని ఆయన కుమారుడు వైఖరిని ఖండిస్తున్నామని అన్నారు. టీడీపీ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు..రాజధానిలో 97 శాతం పూర్తి ఐన కట్టడాలు ఎన్ని ఉన్నాయో చెప్పాలని బొత్స సవాల్ విసిరారు.