ప్యారడైజ్ టు కండ్లకోయ రూట్ : ఒకే పిల్లర్..ఫ్లై ఓవర్..ఆపై మెట్రో రైలు

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 02:46 AM IST
ప్యారడైజ్ టు కండ్లకోయ రూట్ : ఒకే పిల్లర్..ఫ్లై ఓవర్..ఆపై మెట్రో రైలు

హైదరాబాద్..ఈ మహానగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఎన్ని ఫ్లై ఓవర్‌లు నిర్మించినా..వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. వాహనాల సాఫీ జర్నీ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకొంటోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జాతీయ రహదారి 44లో పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా 18.4 కి.మీటర్ల మేర ఆకాశహర్మ్యం (స్కై వే) నిర్మించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో..ఒకే మార్గంలో అదే పిల్లర్‌పై ఫ్లై ఓవర్, ఆపై మెట్రో రైలు రాకపోకలు ఉండేలా ప్లానింగ్ చేస్తోంది.

ఇందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారు చేయడానికి కన్సల్టెన్సీలను ఎంపిక చేసేందుకు హెచ్ఎండీఏ అధికారులు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం నాగర్ పూర్‌లో 5 కి.మీటర్ల మేర నిర్మిస్తున్న ఫోర్ డెక్ ట్రాన్స్ పోర్టు బ్రిడ్జీ మాదిరిగానే 18.4 కి.మీటర్ల మేర 40 అడుగుల ఎలివేటెడ్ కారిడార్‌లో ఒకే పిల్లర్‌పై రెండు మార్గాలను (వాహన, రైలు) ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో నిర్మించాలని యోచిస్తున్నారు. ఇది సాధ్యసాధ్యాలపై కన్సల్టెన్సీ అధ్యయనం చేసి నివేదికను అధికారులకు సమర్పించనుంది. ఈ ప్రాజెక్టుకు రూ. 5 వేల కోట్లకు పైగా వ్యవయమౌతోందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఇటీవలే నాగ్ పూర్ పర్యటనకు వెళ్లి..ఈ రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసిన ఆయన..ఇదే విధానాన్ని హైదరాబాద్‌లో తీసుకొస్తే..ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు వాహనాల కదలికలు సాఫీగా ఉంటాయని, కాలుష్యం కూడా తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ప్యారడైజ్ – కండ్లకోయ స్కైవే ప్రతిపాదనకు అదనంగా మెట్రో మార్గం ఉండేలా చూడాలంటే ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు అందాయని సమాచారం. ప్యారడైజ్, బోయిన్ పల్లి, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల మీదుగా కండ్లకోయ వరకు ఒకే పిల్లర్‌పై రెండు మార్గాల ఏర్పాటుపై ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ఫ్లై ఓవర్‌కు ర్యాంప్‌లు, మెట్రో రైలు నుంచి కిందకు దిగేలా అన్ని ఏర్పాట్లపై అధ్యయనం చేస్తారు. పీపీపీ పద్ధతి కావడంతో ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు ఉండదని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు. 
Read More : బయో డైవర్సిటీ..స్పీడ్‌ థ్రిల్స్‌..బట్‌ కిల్స్‌ : 6 రోజులు..550 ఓవర్ స్పీడు చలాన్లు