ఎంట్రీ లేకుండానే ఎగ్జిట్ అయ్యాడు.. 26 రోజుల్లోనే మనసు మార్చుకున్నాడు!

ఎంట్రీ లేకుండానే ఎగ్జిట్ అయ్యాడు.. 26 రోజుల్లోనే మనసు మార్చుకున్నాడు!

Rajinikanth Cancels Political Plans : దేవుడు శాసించాడు.. తలైవా పాటించాడు.. నో పార్టీ.. నో పాలిటిక్స్.. ఇకపై సేవ మాత్రమేనంటూ ప్రకటించారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏడు పదుల వయస్సులో రాజకీయలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన రజినీకాంత్ మళ్లీ వెనుకడగేశారు. డిసెంబర్ 3న పార్టీ పెడుతున్నట్టు ప్రకటించి ఆయన అస్వస్థతకు గురైన తర్వాత 26 రోజుల్లోనే తన మనసు మార్చేసుకున్నారు. డిసెంబర్ 31న పార్టీని ప్రకటించడం లేదని స్పష్టం చేశారు. దాంతో రజినీ రాజకీయ పార్టీ స్థాపనపై ఊహాగానాలకు తెరదించారు. రాజకీయాల్లోకి రావడం, పార్టీ స్థాపించే ఆలోచన ఇక లేదని తేల్చిచెప్పారు. హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌ తర్వాత రజినీ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన పార్టీ ఆవిర్భావం లేదంటూ సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. రజినీ ప్రకటనతో అభిమానులకి మళ్లీ నిరాశే ఎదురైంది.

ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉండాలని, ప్రజాసేవకు దగ్గరగా భావిజీవితాన్ని గడుపుతానని ఆయన స్పష్టం చేశారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో ప్రకటన ద్వారా తెలియజేశారు. 120 మంది సభ్యులతో కూడిన సినిమా యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. అయినా నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో షూటింగ్ నిలిపివేశాం.. అందరికి కరోనా పరీక్షలు చేయించారు.. నాకు కూడా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. కానీ, బీపీలో హెచ్చుతగ్గులతో అస్వస్థతకు గురయ్యాను. కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకోవడంతో తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరించారు. దాంతో హైదరాబాద్ లోనే చికిత్స చేయించుకున్నానని చెప్పారు.

ఈ పరిణామాలపై ఆలోచిస్తే.. దేవుడు నాకు చేసిన హెచ్చరికగా భావిస్తున్నాను. ఎన్నికల ప్రచార సభలతో లక్షలాది మంది ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. 120 మంది చిత్రబృందంలోనే కరోనా సోకడంతో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సి వచ్చింది. ఎన్నికల ప్రచారానికి వెళ్లి అనారోగ్యం పాలైతే నన్ను నమ్ముకుని నా వెంట రాజకీయ ప్రయాణం చేసే వారిని సైతం సంకట పరిస్థితుల్లోకి పడేసినవాడినవుతాను. నా ప్రాణం పోయినా పర్వాలేదు. ఈ కారణాలతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి రాలేకపోతున్నాను.

ఈ నిర్ణయం రజనీ మక్కల్‌ మన్రం నిర్వాహకులకు, అభిమానులకు, ప్రజలకు నిరాశను కలిగిస్తుంది. నన్ను క్షమించండి. ఎన్నికల రాజకీయాల్లోకి రాకుండా ప్రజలకు వీలయినంత సేవ చేస్తాను. నిజాలు మాట్లాడేందుకు ఎన్నడూ వెనుకాడను. రజనీ మక్కల్‌ మన్రం యథాప్రకారం పనిచేస్తుంది. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని పెద్ద హృదయంతో అందరూ అంగీకరించాలని వేడుకుంటున్నా’అని రజినీకాంత్ తెలిపారు.