రజత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి : టీ కాంగ్రెస్ నేతలు

  • Published By: chvmurthy ,Published On : May 3, 2019 / 10:08 AM IST
రజత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి : టీ కాంగ్రెస్ నేతలు

ఢిల్లీ : తెలంగాణ శానస సభకు 2018, డిసెంబర్ 7 జరిగిన ఎన్నికల్లో సాయంత్రం 5 గంటలు తర్వాత పోలింగ్ శాతం పెరగటంపై, రాష్ట్ర ఎన్నికల ప్రధాన‌ అధికారిపై  అనుమానాలున్నాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోని  కేంద్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, రేణుకా చౌదరి, నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల తర్వాత అసాధారంగా పోలింగ్ శాతం పెరగడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. తెలంగాణ సీఈఓ రజత్ కుమార్ పోలింగ్ ముగిసిన తర్వాత చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశామని, రజత్ కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టించేలా పోలింగ్ శాతం అంకెలు చెప్పిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకు వెళ్లినట్లు వారు తెలిపారు. తెలంగాణ సీఈవో రజత్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కో నియోజకవర్గంలో లక్షల్లో ఓట్లు పడ్డాయని, నిజామాబాద్, ఖమ్మం, చేవెళ్ళ, సికింద్రాబాద్ లో నమోదైన పోలింగ్ శాతాల్లో వ్యత్యాసాలను ఈసీకి వివరించామని ఈసీ అధికారులు సానుకూలంగా స్పందించారని మర్రి శశిధర్ రెడ్డి చెప్పారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నికల కమిషన్ వద్దకు వచ్చామని కాంగ్రెస్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి చెప్పారు. చట్టాలు అమలు అవుతున్నాయని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అది లేదన్నది అధికారులు గుర్తించాలని ఆమె అన్నారు. పోలింగ్ శాతం అనూహ్యంగా పెరగడంపై అన్ని ఆధారాలతో ఈసీ కి ఫిర్యాదు చేశామని, ఖమ్మం లోక్ సభ స్థానంలో ఎలాంటి అనుమానం లేకుండా గెలుస్తా అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.