విజయనగరంలో నియోజకవర్గ నిధులపై ఎమ్మెల్యేలలో టెన్షన్..!

  • Published By: sreehari ,Published On : September 1, 2020 / 07:15 PM IST
విజయనగరంలో నియోజకవర్గ నిధులపై ఎమ్మెల్యేలలో టెన్షన్..!

మొన్నటి ఎన్నికల్లో ఊహించని మెజార్టీతో విజయకేతనం ఎగురవేసిన వైసీపీ ఎమ్మెల్యేల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుగులేని అభివృద్ధి చేసి, ప్రజలకు తమ సత్తా ఏంటో రుచి చూపించాలనుకొని తెగ ఉబలాటపడ్డారు. రోజులు, నెలలు గడచిపోయాయి.



అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయింది. వెనక్కి తిరిగి చూస్తే… కాలం కరిగిపోవడం తప్ప అభివృద్ధి మాత్రం జరగలేదంటూ కొంతమంది ఎమ్మెల్యేలు ఉసూరుమని అంటున్నారట. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఎమ్మెల్యేలు బయటకు చెప్పుకోలేక… లోలోపలే మదనపడుతున్నారట.

అకౌంట్లు ఖాళీ.. :
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు పడకేశాయనే విమర్శలు బాగానే వినిపిస్తున్నాయి. కేవలం నవరత్నాలు తప్ప… మిగిలిన మౌలిక సదుపాయాలు, వివిధ అభివృద్ధి పనుల గురించి పట్టించుకునే నాథుడే లేడని పెదవి విరుస్తున్నారు.



మరీ ముఖ్యంగా పట్టణాలు, గ్రామాల్లో మురికి కాలువల నుంచి రహదారుల పనుల వరకు ఏవీ ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం నోరు మెదపని పరిస్థితి నెలకొంది. పంచాయతీలు, పురపాలక సంఘాల్లోని జనరల్ ఫండ్ అకౌంట్లు కూడా ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో కనీసం మీటరు పొడవున రోడ్డు కూడా నిర్మించలేని పరిస్థితిలు ఉన్నాయంటూ ఎమ్మెల్యేలు పెదవి విరుస్తున్నారట.

ఎమ్మెల్యేలలో అసంతృప్తి :
ఏడాది కాలంగా నియోజకవర్గాలకు చిల్లిగవ్వ కూడా మంజూరవ్వలేదని చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు ఇప్పుడు కరోనాతో మొత్తం వ్యవస్థే తల్లకిందులైంది. కేంద్రం ఎంపీ ల్యాడ్స్‌ను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులను నిలిపివేసింది. దీంతో నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

కరోనా కారణంగా కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం విడుదల చేయాల్సిన ఎంపీ ల్యాడ్స్ నిధులను నిలిపివేసింది. ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఎంపీ ల్యాడ్స్ ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. దీంతో ఆ నిధులపై ప్రజాప్రతినిధులు ఆశలు వదులుకున్నారు.



ఇక, వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం విడుదల చేసే ప్రత్యేక అభివృద్ధి పథకం నిధులను కూడా 2017-18 నుంచి నిలిపివేసింది. ఈ నిధుల కింద ఏటా 50 కోట్ల రూపాయలు విడుదల అవుతుంటాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నియోజకవర్గాలకు ఎలాంటి నిధులు విడుదల కావడం లేదు.

ముఖ్యంగా ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ప్రతీ ఏటా విడుదల అవుతుంటాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఈ కోటా కింద విడుదల కాలేదట. ఇప్పుడు కరోనా కారణంగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. దీంతో ఎమ్మెల్యేల పరిస్థితి అధ్వానంగా తయారైంది.

నిధుల వేటలో ఎమ్మేల్యేలు :
గతంలో ఎంపీ, ఎమ్మెల్యేల నిధులతో నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టేవారు. కానీ, ప్రస్తుతం నిధుల లేమితో చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నామని ఎమ్మెల్యేలు తెగ ఫీల్ అవుతున్నారు. కరోనా విజృంభణతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో శాసనసభ్యులు ఇప్పుడు నిధుల వేటలో పడ్డారు.



కరోనా రాకముందు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలు ముందుకు వచ్చి తమ సొంత నిధులతో స్థానికంగా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టేవి. ప్రస్తుతం కరోనా
కారణంగా చాలా కంపెనీలు మూతపడగా, మరికొన్ని అరకొర సిబ్బందితో, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థలు కూడా చేతులెత్తేశాయి.

ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు చేసేది లేక ప్రజలకు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్నారు. మన ఊరు, మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కేవలం ప్రభుత్వమే కాదని, వ్యక్తిగత సామాజిక బాధ్యతతో ప్రతీ ఒక్కరూ ఆర్థిక సాయం చేయాలంటూ పిలుపునిస్తున్నారు.



ఈ విషయంలో ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఒక అడుగు ముందుకేసి తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఆర్థికంగా అవకాశం ఉన్న వారు ఎంతోకొంత సహకారం అందించి, తోడ్పాలంటూ పిలుపు నిస్తున్నారు. మొత్తం మీద అసలు ఎలాంటి పనులు చేసే అవకాశం లేకపోవడంతో ఎమ్మెల్యేలు అంత యాక్టివ్‌గా కనిపించడం లేదంటున్నారు.