ఆ పోస్టు కోసం వైసీపీలో తీవ్రమైన పోటీ, జగన్ ఎవరిని కరుణిస్తారో

  • Published By: naveen ,Published On : August 5, 2020 / 02:45 PM IST
ఆ పోస్టు కోసం వైసీపీలో తీవ్రమైన పోటీ, జగన్ ఎవరిని కరుణిస్తారో

ఏపీలో రాజధాని తరలింపు కంటే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఇది అధికార పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది. మండలి ప్రాంతీయ కార్యాలయాలతో పాటు వివిధ శాఖల హెచ్‌వోడీ కార్యాలయాలు సైతం కొలువుదీరనున్న ఆయా జోన్లకు చైర్మన్లుగా అధికార పార్టీ నేతలకే అవకాశం కల్పించనుండటంతో ఈ వ్యవహారం రాజకీయంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ జోన్ల ఏర్పాటు అంశం నలుగుతూ వచ్చింది. తాజాగా మరోసారి సీఎం జగన్ జోన్ల ఏర్పాటుకు సముఖంగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పోస్టుకున్న ప్రాధాన్యం కారణంగా చాలామంది ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం.

ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ పోస్టు కోసం పోటీ:
విజయనగరం కేంద్రంగా ఏర్పడే ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ పోస్టు కోసం పలువురు నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ ఏర్పాటులో భంగపడ్డ కొంతమంది నేతలు ఇప్పుడు ఈ పోస్టుపై చాలా ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. విజయనగరం జోన్ పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనుండగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ సర్కారు కొత్తగా ఏర్పాటు చేయనున్న నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్ల పర్యవేక్షణ కోసం భారీ సెటప్ రూపొందించబోతున్నట్లు సమాచారం.

మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి తీపి కబురు:
బోర్డు పరిధిలో చైర్మన్‌తోపాటు ఏడుగురు సభ్యులతో కమిటీ ఉంటుందని, ఆయా జోన్ల చైర్మన్లకు కేబినెట్ ర్యాంకు హోదా కూడా కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవితో సమానంగా జోన్ల చైర్మన్లను ట్రీట్ చేయబోతున్నారన్న సమాచారం అధికార వైసీపీ నేతల్లోని ఆశావాహులకు తీపి కబురులా మారింది. మంత్రి పదవులు ఆశించి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఎమ్మెల్యేలు, గతంలోనే జగన్ నుంచి మాట పొందిన ఇతర కీలక నేతలు ఈ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం.



రేసులో బొత్స మేనల్లుడు:
విజయనగరంతో పాటు విశాఖ, శ్రీకాకుళం జిల్లాలతో ఏర్పాటయ్యే ఈ ప్రాంతీయ అభివృద్ధి మండలి చైర్మన్ పదవికి చాలామంది నేతలు పోటీ పడుతున్నారు. విజయనగరం జిల్లా నేతలకే ఈ పదవి వస్తుందన్న ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. మిగిలిన రెండు జిల్లాలతో పోల్చితే… విజయనగరం జిల్లాలో పలువురు సీనియర్ నేతలున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో పాటు మంత్రి బొత్స మేనల్లుడు చిన్న శ్రీను పేరు కూడా జోరుగా వినిపిస్తోంది.

జూనియర్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి అవమానించారు:
సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర వరుసగా నాలుగు సార్లు తిరుగులేని విజయాలు సాధిస్తూ… జిల్లాలోనే పార్టీ తరఫున సీనియర్ శాసనసభ్యడిగా గుర్తింపు పొందారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు తప్పకుండా మంత్రి పదవి వరిస్తుందని అంతా భావించారు. అయితే, ఆయనను కాదని, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణికి మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా కూడా ఇవ్వడం రాజన్నదొర వర్గాన్ని తీవ్ర నిరాశ కలిగించింది. సీనియర్ అయిన ఎమ్మెల్యేను అవమానించారంటూ అప్పట్లో వైసీపీ అధిష్టానంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రెండో విడత మంత్రివర్గ విస్తరణ జరిగితే రాజన్నదొరకు పదవి గ్యారంటీ అన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి మండలి చైర్మన్ పదవిని రాజన్నదొరకే ఇవ్వాలని దొర వర్గం పట్టుబడుతున్నట్లు సమాచారం.



ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ రేసులో సీఎం జగన్ సన్నిహితుడు:
ఇక మంత్రి పదవిని ఆశించిన వారిలో ఎమ్మెల్యే కోలగట్ల కూడా ఉన్నారు. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ, జిల్లాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోలగట్లకు…మంత్రి పదవి గ్యారంటీ అన్న టాక్ నడిచింది. కానీ, జిల్లాకు సంబంధించి బొత్స సత్యనారాయణకు, పుష్పశ్రీవాణికి మంత్రి పదవులు ఖరారు కావడంతో కోలగట్ల వర్గం అసంతృప్తికి గురైంది. ఎంపీ విజయసాయిరెడ్డితోనూ ప్రత్యేక అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపత్యంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి చైర్మన్ రేసులో ఆయనదే మొదటి పేరంటూ గట్టి ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు ఈ పదవి రేసులో మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను పేరు కూడా బాగా వినిపిస్తోంది.

మండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్న వారిలో చిన్న శ్రీను:
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లాలో పార్టీని ముందుండి నడిపించడమే కాకుండా, ఎన్నికల్లో సీట్లన్నీ గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని జగన్ వద్ద ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ పాదయాత్ర సందర్భంలో వెన్నంటి ఉంటూ, ఆయనకు మరింత చేరువయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడానికి జగన్ అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి జగన్ అభిమానానికి మరింత దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికల్లో చిన్న శ్రీనును అవకాశం కల్పించి, జడ్పీ చైర్మన్ పదవిని కేటాయించారు. అయితే, ఆ ఎన్నికలు రద్దవడంతో ఇప్పుడు చిన్న శ్రీను కూడా ఈ మండలి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం.



రేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి:
అధికార పార్టీ నేతలే కాకుండా, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా ఈ పదవి కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పోయిన ఎన్నికల్లో ఆయన… వైసీపీకి ఆర్థికంగా తన సహాయ సహకారాలు పుష్కలంగా అందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గతంలో ఆయనకు జగన్ నుంచి హామీ కూడా వచ్చిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ఉత్తరాంధ్ర ప్రాంతీయ అభివృద్ధి మండలి ఏర్పాటుతో ఈ ప్రాంతానికి ఎలావంటి ప్రయోజనం జరుగుతుందో తెలియదు గానీ… రాజకీయ నేతలు మాత్రం పదవుల కోసం పాకులాడుతున్నారు.