Dhanatrayodashi : ధనత్రయోదశి ప్రత్యేకత తెలుసా?..

యమలోకంలోని పితరులు  ఈ పండగకు తిరిగి తమ పూర్వ గృహాలకు వస్తారని పలువురి విశ్వాసం. ధన త్రయోదశి నాడు సాయంకాలం తమ ఇళ్ళముందు దక్షిణ దిశగా దీపాలు ఉంచుతారు.

Dhanatrayodashi : ధనత్రయోదశి ప్రత్యేకత తెలుసా?..

Dhanteras1

Dhanatrayodashi : దీపావళి పండగను ఐదు రోజులపాటు పర్వదినాలుగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఐదురోజుల పర్వదినంలో తొలిరోజున ధన త్రయోదశి జరుపుకుంటారు. హిందూ సాంప్రదాయాల ప్రకారం కార్తీక మాసం కృష్ణపక్ష త్రయోదశిని ధన త్రయోదశిగా జరుపుతారు. ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన ధనత్రయోదశిగా జరపనున్నారు. ధనత్రయోదశి రోజున ఐశ్వర్య దేవత గా భావించే మహాలక్ష్మీ పాలసముద్ర మథనంలో సముద్రం నుండి బయటకు ఉద్భవించింది. అందుకే సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని ఈ ధనత్రయోదశి రోజున పూజిస్తారు. ఈ కారణం చేతనే ధన త్రయోదశి ప్రాముఖ్యతను సంతరించు కున్నది. ధనత్రయోదశి నాడు ప్రదోషకాలంలో అంటే సూర్యాస్తమయం నుంచి లక్ష్మీదేవీకి పూజ చేయటం శ్రేష్ఠమైనది. ప్రదోషకాలంలో, అందులోనూ స్థిరలగ్నంలో లక్ష్మీ పూజ వల్ల అమ్మ మన ఇంటికి వచ్చి, స్థిరంగా నివాసం ఉంటుందని పెద్దల నమ్మకం.

ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ ధనత్రయోదశిని పవిత్రమైన దినంగా ఆచరిస్తారు. ధనత్రయోదశి నాడు లక్ష్మీ దేవిని భక్తితో పూజించాలి. తీపి వంటల్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున బంగారం కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తి కొలది పూజిస్తారు. వ్యాపారస్థులు, గృహస్థులు తమ ప్రాంగణాల్ని శుభ్రం చేసుకొని అలంకరించుకోవాలి. శుచిగా, శుభ్రంగా ఉన్న ఇంటికే లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం. ఈ తల్లిని స్వాగతిస్తూ గుమ్మంలో అందమైన ముగ్గులు వేయాలి. దీపాలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కాలుమోపడానికి ప్రతీకగా ఇంట్లో బియ్యం పిండి, పసుపుతో బుడిబుడి అడుగుల గుర్తులు వేస్తారు. లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ, రాత్రంతా దీపాలు వెలుగుతూనే ఉండాలి.

యమలోకంలోని పితరులు  ఈ పండగకు తిరిగి తమ పూర్వ గృహాలకు వస్తారని పలువురి విశ్వాసం. ధన త్రయోదశి నాడు సాయంకాలం తమ ఇళ్ళముందు దక్షిణ దిశగా దీపాలు ఉంచుతారు. అయితే తల్లి,దండ్రులు ఉన్నవారు ఇలా దీపాలను దక్షిణ దిక్కున వెలిగించరాదు. పరిపూర్ణ ఆయువు కోసం ధనత్రయోదశి నాడు యమధర్మరాజును పూజించాలి. ఆ రోజున సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాల్ని వెలిగించాలి. వీటిని యమదీపాలుగా చెప్తారు. ఇలా చేయటం వల్ల యముడు శాంతించి, అకాల మృత్యువును దరిచేరనీయడని పురాణగాధలు చెబుతున్నాయి.

ఆయుర్వేద విజ్ఞానానికి ధన్వంతరి ఆరాధ్య దైవం. క్షీరసాగర మథనం సమయంలో మహావిష్ణువు అంశావతారంగా అమృత కలశ హస్తుడై సమస్త జనావళికి రోగ నివారణ ద్వారా ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి థన్వంతరి ఆవిర్భవించిన దినాన్ని హిందువులు ధన త్రయోదశి అని పండుగ జరుపుకుంటారు. అలాగే వామనుడు త్రివిక్రమ అవతారాన్ని ధరించి బలి చక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడని చెబుతుంటారు. ధన త్రయోదశి రోజు దుస్తులను, ధాన్యాలను, దానం చేయాలి. అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఎంతో శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.