నేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం-ఈ నెలలో పర్వదినాలు

నేటి నుండి మార్గశిర మాసం ప్రారంభం-ఈ నెలలో పర్వదినాలు

Significance of Margasira Masam : విశిష్టమైన హైందవ సంస్కృతిలో ప్రతి మాసానికీ ప్రాశస్త్యం ఉంది. అయితే మాసాలన్నింటిలో మార్గశిర మాసం ఎంతో ప్రత్యేకమైనది. మార్గశిరం సర్వం పర్వదినాల సమాహారం.

మార్గశిర మాసాన్నే ‘మార్గశీర్షం’ అని కూడా వ్యవహరిస్తారు. శీర్షం అంటే అగ్రభాగం అని అర్థం. మాసాల్లోకెల్లా అగ్రగణ్యమైనది కాబట్టి మార్గశిరానికి ఈ పేరు వచ్చింది. ఈ విషయాన్నే తేటతెల్లం చేసేలా మాసాలలో తానే మార్గశిరమని అర్జునునికి గీతాచార్యుడు విభూతి యోగంలో తేటతెల్లం చేశాడు. అర్జునునితో కృష్ణపరమాత్మ తాను ‘వేదానాం సామవేదోస్మి దేవానాం వాసవః’అంటే ‘ ఇంద్రుడు’ అని చెబుతూనే….. తాను ‘ మాసానాం మార్గశీర్షోహం’ అని ప్రకటించాడు.

వాసుదేవుని దివ్యవాక్కులను ప్రతిబింబించేలా మార్గశిరమంతా మోక్షదాయకాలైన పర్వదినాలెన్నో ఉన్నాయి. మార్గశిర ప్రారంభంలోనే శివ పుత్రుడైన కుమారస్వామిని అర్చించే ‘సుబ్రహ్మణ్య షష్టి’ పర్వదినం వస్తుంది. మార్గశిర శుద్ధ షష్టిని సుబ్రహ్మణ్య షష్టిగా ఘనంగా జరుపుకుంటారు. షణ్ముఖుడైన కుమారస్వామిని ఆత్మతో కూడిన పంచభూతాలకు నిదర్శనంగా భావించి పూజించే సాంప్రదాయం తమిళనాట ఉంది. యోగసాధకులు స్కంధుని ఆరు ముఖాలను షట్చక్రాలుగా భావించి ఆరాధిస్తారు. సుబ్రహ్మణ్య రూపాన్ని బ్రహ్మజ్ఞానానికి సంకేతంగా భావించే ఆర్ష సంప్రదాయమూ దేశంలో అనూచానంగా వస్తోంది. సుబ్రహ్మణ్యుని ఆరాధన యోగబలాన్నీ, ఆరోగ్య ఫలాన్నీ ప్రసాదిస్తుంది.

మిత్రసప్తమి’ గా పేర్కొనే మార్గశిర శుక్లపక్ష సప్తమి నాడు జగన్మిత్రుడు, లోకాలకు కాంతినిచ్చే సూర్యదేవుని సమస్త హిందువులూ ఆరాధిస్తారు. ఈ శుభ తిథి నాడు ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుణ్ని పూజిస్తే దివ్యమైన ఆరోగ్యమూ, మహాభాగ్యమూ ఒనగూడుతాయని భక్తుల విశ్వాసం. హైందవ సంస్కృతిలో అంతర్భాగమై దివాకరుని ఆరాధన పావనమైన రీతిలో జరిపే భాను సప్తమి, రథసప్తమి, మార్తాండ సప్తమి, అచల సప్తమి, పర్వదినాలలాగా ‘మిత్రసప్తమి’ కూడా అత్యంత యోగదాయకమైన పర్వదినం.

మార్గశిర శుక్లపక్ష ఏకాదశిని ‘గీతాజయంతి’గా జరుపుకుంటారు. విశ్వమానవ విజ్ఞాన కోశంగా భావించే భగవద్గీతను ఈ పర్వదినాన కురుపాండవ యుద్ధ సమయాన అర్జునునికి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు.  ఇక మహా మహిమాన్వితమైన శుక్లద్వాదశీ వ్రతాన్ని మార్గశిర శుక్ల ద్వాదశి నాడు ఆచరిస్తారు. ఆ రోజున అత్యంత శ్రద్ధతో దేవదేవుడైన మహావిష్ణువుని ధ్యానిస్తూ కేశవార్చన చేస్తే ఎనిమిది పౌండరీక యజ్ఞాలు చేసిన ఘనమైన ఫలాన్ని ఈ వ్రతం ప్రసాదిస్తుందని లోక కళ్యాణ కారకుడైన నారదుడికి సనక మహర్షి తేటతెల్లం చేసినట్లు నారద మహా పురాణం చెబుతోంది.

మార్గశిర శుక్ల త్రయోదశి నాడు భక్తులు అభయదాయకుడైన హనుమంతుని సేవిస్తారు. ఆ రోజున అతి పవిత్రమైన హనుమద్‌వ్రతాన్ని ఆచరిస్తారు. శరణాగత వజప్రంజరుడైన అంజనీసుతుని ఆరాధన దుష్టపీడను భంధించి జీవితాన సుఖ సంతోషాలను పంచి రంజకం చేస్తుంది. మార్గశిర మాసంలోనే సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించడంతో ధనుస్సంక్రమణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. అది మొదలుకుని సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంత వరకు ఉండే పవిత్రమైన మాసమే ‘ధనుర్మాసం’. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ధనుర్మాస పుణ్యకాలం.

ధనుర్మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. తన హృదయ నందనంలో పూచిన భక్తి భావ సుమాలనే ప్రేమతో శ్రీరంగనాధునికి సమర్పించి, ఆ దేవదేవునికి సమర్పించాల్సిన మాలలను తానే ధరించి, ఆ స్వామి కృపకు పాత్రురాలై శ్రీరంగనాధుని సాయుజ్యాన్ని పొందిన ఘన చరిత గోదాదేవిది.  ఈమెనే వైష్ణవ సాంప్రదాయంలో అండాళ్ అనీ, చూడి కుడుత నాంచారి అనీ వ్యవహరిస్తారు. గోదాదేవి రచించిన ‘ తిరుప్పావై’లోని భక్తి భావస్పోరకమైన 30 పాశురాలను ఈ మాసం రోజూలూ విష్ణాలయాలన్నింటా ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటే శ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులూ సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు.

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గళి’ మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ పర్వదినాన్నే ‘ముక్కోటి ఏకాదశి’ గా జరుపుకుంటారు. ఈ పర్వదినాన దేవాదుందుభులు మోగుతుండగా శ్రీమహాలక్షీ సమేతుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠం ఉత్తర ద్వారానికి జేరి ముక్కోటి దేవతలకు తన దివ్యద ర్శన భాగ్యాన్ని కలుగచేస్తాడని పురాణవచనం. దీనికి సంకేతంగానే దేశంలోని వైష్ణవాలయాలన్నింటా భక్తులు దర్శనం చేసుకునేందుకు వీలుగా ఆలయ ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.

ఈ పవిత్ర పర్వదినాన నారాయణుని అర్చిస్తే, ఆయతో బాటు ముక్కోటి దేవతలనూ ఆరా«ధించిన ఫలం వస్తుంది కాబట్టి ఏ ఏకాదశిని ‘ ముక్కోటి’గా పేర్కొనడం జరిగింది. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటారనే ఐతిహ్యమూ ఉంది. ముక్కోటి ఏకాదశి నాడే క్షీరసాగర మధనంలో హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ పవిత్రమైన రోజునే పరమశివుడు హాలాహలాన్ని మింగి లోకాలకు ఆనందాన్ని కలిగించాడు.

ఇవేగాక దత్త జయంతి, కృష్ణాంగారక చతుర్దశి వంటి మరిన్ని పర్వదినాలు కొలువై మార్గశిర మాసానికి కమనీయతను సంతరించి పెట్టాయి. మాసానాం మార్గశిర్షోహం అంటే ఏమిటి? మృగశిర నక్షత్రం కలసి పౌర్ణమినాడు చంద్రుడు ఉదయించే నెల మార్గశీర్ష మాసం. “మాసానాం మార్గశీర్షోహం” అని కృష్ణుడు స్వయంగా చెప్పాడు. కనుక మార్గశిర మాసం విష్ణుదేవుని రూపం. భాద్రపదంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, కార్తీకంలో శివుని, మార్గశిరంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుని ఇలా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను అర్చిస్తూ పంచాయతన పూజా విధానాన్ని తెలియ పరచారు.

సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలిబాధ ఉండదు. బ్రాహ్మీముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం. అందువల్ల బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందన జప ధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని ప్రచోదనం చేస్తాయి. అందుకే మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారు ఝామున నిద్రలేచి స్నానం చేయడం ఆచారమైంది. నందవ్రజంలోని గోపికలు పరమేశ్వరుడైన విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణునిలో అద్వైత స్థితిని పొందగోరి మార్గశిర మాసంలో వ్రతం ఆచరించి ఆ పరమాత్మను పొందారని పురాణవచనం.