Gregg Chappell: గిల్‌ను ఔట్ చేయడం పెద్ద కష్టమైన పని కాదు.. అదే అతడి బలహీనత
టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్(Gregg Chappell) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Shubman Gill-Gregg Chappell
Gregg Chappell-Shubman Gill: టీమ్ఇండియా యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubman Gill) ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL)లో ఏకంగా మూడు శతకాలు బాదేశాడు. మొన్నటి వరకు పొట్టి ఫార్మాట్‌లో పరుగుల వరద పారించిన గిల్ ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ (WTC Final 2023) మ్యాచ్‌లోనూ సత్తా చాటేందుకు సిద్దం అయ్యాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో గిల్‌పై ఆసీస్ మాజీ క్రికెటర్ గ్రెగ్ ఛాపెల్(Gregg Chappell) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న చిన్న లోపాలు ఉన్నాయని వాటిని లక్ష్యంగా చేసుకుని ఆసీస్ బౌలర్లు అతడిని తొందరగా ఔట్ చేయొచ్చునని చెప్పాడు. ఒకవేళ అతడిని తొందరగా ఔట్ చేయడంలో బౌలర్లు విఫలమైతే మాత్రం అతడిని ఆపడం చాలా కష్టమని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఓవర్‌సీస్ పిచ్‌లపై ఎలా ఆడాలనేదానిపై గిల్ కు తగినంత అనుభవం ఉంది. అయినప్పటికి ఇంగ్లాండ్‌లో ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో అతడు ఖచ్చితంగా ఇబ్బందులు పడుతాడని చాపెల్ అన్నాడు.
లైన్ అండ్ లైన్త్ బంతులు అతడిని ఇబ్బందులకు గురి చేస్తాయని చెప్పాడు. ముఖ్యంగా ఆఫ్‌స్టంప్ వెలుపల అదనపు పేస్‌తో వేసే బంతులకు అతడు చాలా సార్లు పెవిలియన్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. అదే సమయంలో ఏ మాత్రం బంతి గతితప్పినా పనిష్‌మెంట్ తప్పదన్నాడు. ఎంత తొందరగా అతడిని పెవిలియన్‌కు పంపిస్తే అంత మంచిదని, అతడు క్రీజులో కుదురుకుంటే మాత్రం బౌలర్లకు తిప్పలు తప్పవన్నాడు. మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, బొలాండ్ ఈ ముగ్గురిలో ఎవరైనా సరే బౌన్స్‌తో బౌలింగ్ వేస్తే మాత్రం క్రీజులో ఎంత పెద్ద బ్యాట్స్‌మెన్ ఉన్నా సరే ఔట్ కావాల్సిందేనని చాపెల్ చెప్పుకొచ్చాడు.
లండన్‌లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు శుభ్‌మన్ గిల్ టీమ్ఇండియా తరుపున 15 టెస్టులు ఆడి 34.2 సగటుతో 890 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు, నాలుగు అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 128. గిల్ మరో 110 పరుగులు చేస్తే టెస్టు క్రికెట్‌లో వెయ్యి పరుగులు పూర్తి అవుతాయి.