వెస్టిండీస్ కెప్టెన్ గా పోలార్డ్: బ్రావో రీ-ఎంట్రీ ఇస్తున్నాడా?

  • Published By: vamsi ,Published On : September 10, 2019 / 09:20 AM IST
వెస్టిండీస్ కెప్టెన్ గా పోలార్డ్: బ్రావో రీ-ఎంట్రీ ఇస్తున్నాడా?

పేలవమైన ఆటతీరుతో ప్రపంచకప్ లో విఫలమైన వెస్టిండీస్ జట్టు విషయంలో ఆ దేశ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. భారత్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కూడా విండీస్ ఘోరంగా విఫలం అయిన క్రమంలో కెప్టెన్సీ బాధ్యతలను కూడా కిరోన్ పొలార్డ్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకు వన్డేలకు జేసన్ హోల్డర్, టీ20లకు కార్లోస్ బ్రాత్ వైట్ కెప్టెన్లుగా ఉన్నారు. 2016నుంచి పెద్దగా అవకాశాలు రాక అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడని పోలార్డ్ కు ఇటీవల భారత్ తో మ్యాచ్ లలో టీ20 టీమ్ లో అవకాశం దక్కింది. తనని తాను నిరూపించుకున్నాడు పోలార్డ్. కానీ భారత్ చేతిలో మాత్రం సీరీస్ కోల్పోయింది విండీస్ జట్టు.

ఈ క్రమంలో ప్రక్షాళన దిశగా అడుగులు వేసిన విండీస్ బోర్డు పరిమిత ఓవర్ల కెప్టెన్ గా పోలార్డ్ ను నియమించింది. 2020 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండిస్ ఇప్పటి నుంచే వేగంగా మార్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది.

అక్టోబర్ 2016 నుండి ఒక్క వన్డే ఆడకపోయినా కూడా పొలార్డ్ వన్డే జట్టు సారథిగా బాధ్యతలు చేపట్టుతుండడం విశేషం. 2007 వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆరంగేట్రం చేసినప్పటి నుంచి పొలార్డ్ 101 వన్డే ఆటలలో ఆడాడు. 2012 లో వెస్టిండీస్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో ముఖ్యమైన పాత్ర వహించాడు.

పోలార్డ్ కు కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించిన క్రమంలో వెస్టిండీస్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన డ్వాయిన్ బ్రావో స్పందించారు. “నా ఫ్రెండ్‌ పొలార్డ్‌కు కంగ్రాట్స్‌. నీలో విండీస్‌ కెప్టెన్‌ అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయి. విండీస్‌ జట్టును ముందుండి నడిపించి ఒక అత్తుత్తమ నాయకుడిగా ఎదుగుతావని ఆశిస్తున్నా. మళ్లీ నన్ను నేను విండీస్‌ జెర్సీలో చూసుకోవాలనుకుంటున్నా. విండీస్‌ తరఫున ఆడాలనుకుంటున్నా” అంటూ ప్రకటించారు.