Harbhajan Singh: ధోనీతో విభేదాలపై స్పందించిన హర్భజన్.. అసలు విషయం చెప్పేశాడు..
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ వారిద్దరి మధ్య విబేధాల విషయంపై ప్రస్తావించారు.

MS dhoni
Harbhajan Singh: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ధోనీ కెప్టెన్సీ సమయంలో అతనికి టీం మేనేజ్‌మెంట్ నుంచి లభించిన మద్దతు మాజీ క్రికెటర్లకు దొరికినట్లయితే చాలా మంది మరికొన్నేళ్లు ఆడేవారు అంటూ వ్యాఖ్యానించారు. హర్భజన్ వ్యాఖ్యల పట్ల కొందరు కామెంట్స్ చేశారు. ధోనీపై భజ్జీ అక్కసు వెళ్లగక్కాడంటూ కొందరు కామెంట్స్ చేశారు. భజ్జీ వ్యాఖ్యలతో.. ఈ ఇద్దరు మాజీ ఆటగాళ్ల మధ్య గతంలో విబేధాలు ఉన్నాయనే వాదనలకు బలంచేకూరినట్లయింది.
భజ్జీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారుతున్న క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వదంతులకు చెక్ పెట్టాడు. ధోనీకి, తనకు మధ్య ఎలాంటి విబేధాలు లేవని, క్రికెట్ నుంచి ఇద్దరం వైదొలిగాక ఎవరి లైఫ్ లో వాళ్లం బిజీ అయ్యామని, అందుకే తరచూ కలుసుకోలేక పోతున్నామని హర్భజన్ అన్నారు. ధోనీ, నేను చాలా మంచి ఫ్రెండ్స్ అని, తమ మధ్య విబేధాలు ఉన్నాయన్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని భజ్జీ క్లారిటీ ఇచ్చాడు.
ధోనీతో గొడవ పెట్టుకోవటానికి నా ఆస్తులు ఏమైనా ధోనీ దొంగిలించాడా? అంటూ సరదా భజ్జీ వ్యాఖ్యానించాడు. అయితే, ధోనీ ఆస్తులపై మాత్రం నా కన్ను ఉందని, అతని ఫామ్ హౌస్ అంటే తనకెంతో ఇష్టమంటూ హర్భజన్ సింగ్ సరదా వ్యాఖ్యలు చేశారు. తాజాగా భజ్జీ వ్యాఖ్యలతో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది.