Suryakumar Yadav : రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన సూర్యకుమార్.. ఆనందంలో అభిమానులు
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది.

Suryakumar Yadav equals Rohit Sharma Mumbai record with 2nd IPL hundred
Suryakumar Yadav – Rohit Sharma : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్, టీ20ల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టింది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన తరువాత వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఖాతాలో మరో రెండు పాయింట్లు జమ కాగా.. పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి ఎగబాకింది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (30 బంతుల్లో 48), పాట్ కమిన్స్ (17 బంతుల్లో 35నాటౌట్) లు రాణించారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్య, చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. బుమ్రా, అన్షుల్ కాంబోజ్ ఒక్కొ వికెట్ సాధించారు.
T20 World Cup 2024 : రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యువరాజ్ సింగ్
లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 102 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడడంతో ముంబై 17.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సూర్యతో పాటు తిలక్ వర్మ (32 బంతుల్లో 37 నాటౌట్) రాణించాడు.
సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత..
సన్‌రైజర్స్ పై శతకంతో చెలరేగడం ద్వారా సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. వీరిద్దరు ముంబై తరుపున చెరో రెండు శతకాలు బాదారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, సైమన్స్, కామెరూన్ గ్రీన్ తదితరులు ఉన్నారు.
ముంబై తరుపున అత్యధిక శతకాలు సాధించిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 2 సెంచరీలు
సూర్యకుమార్ యాదవ్ – 2 శతకాలు
సనత్ జయసూర్య – 1 (2008లో సీఎస్‌కేపై 114),
సచిన్ టెండూల్కర్ – 1 (2011లో కొచ్చి టస్కర్స్‌పై 100),
లెండిల్ సిమన్స్ – 1 (2014లో పీబీకేఎస్‌పై 100),
కామెరాన్ గ్రీన్ – 1(2023లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 100)
SRH vs MI : వాంఖడే స్టేడియంలో జూనియర్ బుమ్రా సందడి.. ఫోటోలు వైరల్.. స్పెషల్ ఏమిటో తెలుసా?
ఆనందంలో అభిమానులు..
ఐపీఎల్ 17వ సీజన్‌లో ఓ మోస్తరుగా రాణించిన సూర్యకుమార్ యాదవ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో చెలరేగి టాప్ ఫామ్‌ను అందుకున్నాడు. టీ20 ప్రపంచకప్ ముందు సూర్య ఫామ్‌లోకి రావడంతో అతడి ఫ్యాన్స్‌తో పాటు టీమ్ఇండియా అభిమానులు ఎంతో సంతోషంలో ఉన్నారు. భారత కాలమానం ప్రకారం జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.