Hockey Player Paramjeet Kumar: రోజు కూలీగా మారిన హాకీ ప్లేయర్.. పిలిచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన పంజాబ్ సీఎం

Hockey Player Paramjeet Kumar: పంజాబ్ హాకీ ఆటగాడు పరమ్ జీత్ కుమార్ కష్టాలు తీరనున్నాయి.

Hockey Player Paramjeet Kumar: రోజు కూలీగా మారిన హాకీ ప్లేయర్.. పిలిచి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన పంజాబ్ సీఎం

Hockey Player Paramjeet Kumar: పంజాబ్ హాకీ ఆటగాడు పరమ్ జీత్ కుమార్ కష్టాలు తీరనున్నాయి. రాష్ట్రస్థాయిలో ఆడిన అతడు ప్రస్తుతం దీనస్థితిలో జీవనం సాగిస్తున్నాడని జాతీయ మీడియా వెలుగులోకి తేవడంతో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందించారు. పరమ్ జీత్ కుమార్ కు క్రీడా శాఖలో కోచ్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీయిచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి అండగా నిలబడడంతో అతడి కష్టాలకు ఫుల్ స్టాఫ్ పడుతుందని క్రీడాభిమానులు భావిస్తున్నారు.

హాకీ క్రీడలో పరమ్ జీత్ కుమార్ ప్రస్థానం 2004 నుంచి 2015 వరకు సాగింది. ఫరీద్‌కోట్‌లో పెరిగిన అతడు ప్రభుత్వ బిజేంద్ర కళాశాలలో కోచ్ బల్తేజ్ ఇందేపాల్ సింగ్ బాబు నిర్దేశకత్వంలో హాకీలో ఓనమాలు నేర్చుకున్నాడు. తర్వాత బల్జిందర్ సింగ్ వద్ద కోచింగ్ తీసుకున్నాడు. పాటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్( NIS)శిక్షణా కేంద్రానికి ఎంపికయ్యాడు. 2007లో NISలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హాకీకి సెలెక్ట్ అయ్యాడు.

అండర్16, అండర్18 జాతీయ హాకీ జట్టులో సభ్యుడిగా 2009 వరకు కొనసాగాడు. ఈ జట్టు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన అండర్ 16 నేషనల్స్‌లో రజత పతకాన్ని సాధించింది. తర్వాత పంజాబ్ పోలీస్, పంజాబ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్‌కు కాంట్రాక్ట్‌పై ఆడాడు. ఢిల్లీలో జరిగిన నెహ్రూ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆడిన భారత జూనియర్ జట్టులో కూడా అతడు సభ్యుడు. మణికట్టు గాయంతో 2012లో కుమార్ ఆటకు దూరమయ్యాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో కుటుంబాన్ని పోషించడానికి రోజువారీ కూలీగా మారాడు. గోధుమ బస్తాలు మోస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అతడి దీనగాధీను నేషనల్ మీడియా తాజాగా వెలుగులోకి తేవడంతో పంజాబ్ సీఎం స్పందించారు. పరమ్ జీత్ కుమార్ ను బుధవారం తన దగ్గరకు పిలిపించుకుని భరోసాయిచ్చారు.

గత ప్రభుత్వం నీ కష్టాలను వినలేదని ఆందోళన చెందవద్దు. ఇక నుంచి నీ కష్టాలన్నీ తొలగిపోతాయి. క్రీడా శాఖలో ఉపాధి కల్సిస్తాం. దీనికి సంబంధించిన జీవోను త్వరలోనే జారీ చేస్తాం. నీ క్రీడా ప్రతిభను గుర్తించే అవకాశం కల్పిస్తున్నాం. త్వరలోనే ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. క్రీడల్లో పంజాబ్‌ను మళ్లీ మొదటి స్థానంలో నిలపడమే మా లక్ష్యమని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. సీఎం హామీ పట్ల పరమ్ జీత్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. కోచ్‌గా ఉద్యోగం చేయడానికి అవకాశం రావడం తన జీవితాన్ని మార్చే అంశమని, తనకు ఏ బాధ్యత అప్పగించినా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని చెప్పాడు. యువ ఆటగాళ్ల ప్రతిభను సానబెడతానని, అట్టడుగు స్థాయిలో హాకీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నానని వెల్లడించారు.