ధావన్ స్థానంలో పృథ్వీ షా, రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌

ధావన్ స్థానంలో పృథ్వీ షా, రెండో వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌

వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్‌మెంట్. చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ 16 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఆస్టేలియాపై ఆడిన జట్టులో ధావన్ స్థానంలో పృథ్వీ షాను తీసుకుంటూ కీలకమార్పు చేశారు. ఇక టీ20 ఫార్మాట్‌లో గబ్బర్‌ స్థానాన్ని యువ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ భర్తీ చేయనున్నాడు. 

వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న పృథ్వీ షా: 
గాయం నుంచి కోలుకున్న తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ లకు దూరంగా ఉన్న పృథ్వీ.. ఇండియా ఏ జట్టులో ఆడుతూ ఫామ్ రాబట్టుకున్నాడు. దీంతో విదేశీ గడ్డపై ఆడేందుకు తొలిసారి వన్డేల్లో అడుగుపెట్టనున్నాడు షా. భారత్‌ తరఫున 2 టెస్టులు ఆడి గాయాలకు గురవడం, డోపింగ్‌ నిషేధంతో పృథ్వీ కొంతకాలం పాటు ఆటకు దూరమయ్యాడు. ఇటీవలే పునరాగమనం చేసిన అతనికి వన్డేల్లో అవకాశం దక్కడం విశేషం. 

శాంసన్ కల తీరినట్లేనా:
గాయం కారణంగా టీ20లకు దూరమైన ధావన్‌ స్థానాన్ని భర్తీ చేయడంలో శాంసన్‌కు మరో అవకాశం దక్కినట్లు అయింది. శ్రీలంకతో సిరీస్‌ అనంతరం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన సంజూకు మరో అవకాశం కల్పించారు. వరుసగా బెంచ్ కే పరిమితమైన శాంసన్ విండీస్‌తో మూడో టీ20 ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడి 6 పరుగులు సాధించాడు. శాంసన్‌, పృథ్వీ షా ప్రస్తుతం కివీస్‌ పర్యటనలోనే భారత్‌ ‘ఎ’ జట్టులో సభ్యులుగా ఉన్నారు.

భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టులు జరుగుతాయి. జనవరి 24నుంచి తొలి టీ20 మ్యాచ్‌తో కివీస్ తో మ్యాచ్ లు మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 5న తొలి వన్డే 8న రెండో వన్డే 11న మూడో వన్డే జరుగుతాయి. గతేడాది న్యూజిలాండ్‌లో పర్యటించిన టీమిండియా వన్డే సిరీస్‌ను 4-1తో గెలుచుకొని.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయింది. 

టీ20 జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, సంజు శాంసన్‌, కేఎల్ రాహుల్, శ్రేయాస్‌ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషబ్ పంత్‌, శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌.

వన్డే జట్టు:
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్ శర్మ, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్‌ పాండే, రిషబ్ పంత్, కేదార్‌ జాదవ్, శివమ్‌ దూబే, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌.