Kane Williamson: హైదరాబాద్ కెప్టెన్‌గా విలియమ్సన్..

Kane Williamson: హైదరాబాద్ కెప్టెన్‌గా విలియమ్సన్..

Hyderabad

Kane Williamson handed SRH captaincy: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇంతకుముందు సీజన్‌ల కంటే దారుణంగా విఫలం అవుతోంది. ముఖ్యంగా మిడిలార్డర్ ఘోరమైన వైఫల్యం కారణంగా గెలిచే మ్యాచ్‌లను కూడా మొదట్లో సన్ రైజర్స్ కోల్పోయింది. ఐపీఎల్ లో మెరుగైన రికార్డు కలిగివున్న సన్ రైజర్స్ దారుణంగా ఆడుతుండడంపై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు 6 మ్యాచ్లు ఆడగా.. అందులో ఒక్క మ్యాచ్‌లో మాత్రమే హైదరాబాద్ గెలిచింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న సన్‌రైజర్స్‌ను గట్టెక్కించే బాధ్యతలను ఫ్రాంచైజ్ విలియమ్సన్‌కు అప్పగిస్తున్నట్లుగా తన సామాజిక ఛానెళ్లలో ధృవీకరించింది. కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ సామర్థ్యంపై సీనియర్ క్రికెటర్లు సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో రేపు జరిగే మ్యాచ్‌తో పాటు టోర్నీలో మిగిలిన మ్యాచ్‌లకు కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. సన్ రైజర్స్ జట్టు రేపు(ఆదివారం) రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుండగా.. కెప్టెన్సీ మార్పు అప్పటినుంచే అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని జట్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం ఎంతో కఠినమైనదని, ఏళ్లుగా డేవిడ్ వార్నర్ అందించిన సేవలు ఎనలేనివని సన్‌రైజర్స్ తెలిపింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు డేవిడ్ వార్నర్ ఆట తీరు, కెప్టెన్సీ పట్ల కొంతకాలంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై సెహ్వాగ్ కూడా విమర్శలు గుప్పించాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు రాబట్టే విషయంలో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడని విమర్శించారు.

‘ఓ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం రేటింగ్ ఇవ్వను. సీజన్ ఆరంభంలో కెప్టెన్‌గా అద్భుతం చేసిన వార్నర్.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. కేన్ విలియమ్సనే కెప్టెన్‌గా ఉంటే అతను ఏదో ఒకటి విభిన్నంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్లు తీయకుంటే మ్యాచ్ గెలవమనే విషయం అతనికి తెలుసు.’అని సెహ్వాగ్ అన్నారు.