PM Modi : అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి..టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులతో మోదీ

జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

PM Modi : అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి..టోక్యో ఒలంపిక్స్ లో పాల్గొనే క్రీడాకారులతో మోదీ

Modi2

PM Modi జులై 23 నుంచి ప్రారంభమయ్యే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత అథ్లెట్లు అంచనాలకు తలవంచకుండా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. మరికొద్ది రోజుల్లో టోక్యోకు పయనమవుతున్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ వర్చువల్ గా మాట్లాడి వారిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెనక దేశం మొత్తం అండగా ఉందన్నారు. అత్యున్నత క్రీడా వేదికపై అథ్లెట్లు రాణించి భారత పతాకం రెపరెపలాడించాలని మోదీ అభిలాషించారు.

ఈ సందర్భంగా ప్రధాని పలువురు దిగ్గజ క్రీడాకారులు మేరీకోమ్‌, పీవీ సింధు,సానియా మీర్జా, సౌరభ్‌ చౌదరి, శరత్‌ కమల్‌ ..తదితరులతో మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు. పీవీ సింధుతో పాటు, ఆమె తల్లిదండ్రులతోనూ మోదీ మాట్లాడారు. సింధును ప్రపంచ చాంపియన్ గా ఎలా మలిచారంటూ ఆమె తల్లిదండ్రులను అడిగారు. హైదరాబాద్ టెన్నిస్ భామ సానియా మీర్జాతో మాట్లాడి ఆమె కెరీర్ గురించి తెలుసుకున్నారు మోదీ. తన పాతికేళ్ల టెన్నిస్ ప్రస్థానాన్ని సానియా మీర్జా ప్రధానికి వివరించింది. దేశంలో క్రీడలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహాన్ని కొనియాడింది.

మరోవైపు ,టోక్యో ఒలింపిక్స్‌కు భారత్‌ నుంచి మొత్తం 228 మంది బృందం వెళుతుందని, అందులో 119 మంది అథ్లెట్లు ఉన్నారని భారత ఒలింపిక్స్‌ సంఘం అధ్యక్షుడు నరిందర్‌ బత్రా తెలిపారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారన్నారు. మొత్తం 85 విభాగాల్లో భారత క్రీడాకారులు పోటీపడుతున్నారని చెప్పారు. ఈనెల 17న 90 మంది క్రీడాకారులు, ఆయా విభాగాల అధికారులు ప్రత్యేక విమానంలో టోక్యోకు బయలుదేరుతున్నట్లు ఆయన తెలిపారు.