మంధాన సెంచరీ: న్యూజిలాండ్‌పై అలవోక విజయం

మంధాన సెంచరీ: న్యూజిలాండ్‌పై అలవోక విజయం

న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని భారత్ 33 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి సాధించగలిగింది.

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ 192 పరుగులకే ఆలౌటైంది. కివీస్ ఓపెనర్లు సుజీ బేట్స్‌(36), సోఫీ డివైన్‌(28)లు పరవాలేదనిపించారు. కొద్దిపాటి విరామంతోనే సోఫీ.. ఆ తర్వాత లారెన్‌ డౌన్‌ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరారు. ఇలా న్యూజిలాండ్ 70 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సాటెర్‌వైట్‌(31), అమీలా కెర్‌(28)లు 49 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించడంతో కొద్దిపాటి స్కోరు మాత్రమైనా చేయగలిగింది. భారత బౌలర్లలో ఏక్తాబిస్త్‌, పూనమ్‌ యాదవ్‌లు తలో 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ 2, శిఖా పాండేకు ఒక వికెట్‌ తీయగలిగారు.

193 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన భారత జట్టు ఓపెనర్ స్మృతి మంధాన(105; 104 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ సాధించగా… రోడ్రిగ్స్‌(81 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు) సాయంతో హాఫ్‌ సెంచరీ చేశారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 190 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మృతి మంధాన న్యూజిలాండ్ గడ్డపై సెంచరీ సాధించిన రెండో భారత మహిళగా రికార్డు సాధించింది. స్మృతి మంధాన భారత్ వెలుపల చేసిన నాలుగో సెంచరీ కావడం విశేషం. బౌలర్లకు చుక్కలు చూపిస్తూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించి మంథాన సెంచరీతో మెరవగా, రోడ్రిగ్స్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది.