మెరిసిన కోహ్లీ : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

  • Published By: madhu ,Published On : September 19, 2019 / 01:43 AM IST
మెరిసిన కోహ్లీ : దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం

మొహాలీలో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 149 పరుగుల టార్గెట్‌ను మరో ఓవర్‌ మిగిలి ఉండగానే చేధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా… నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు ధవన్, రోహిత్‌లు శుభారంభమే ఇచ్చారు. అయితే.. 12 పరుగులు చేసిన రోహిత్ శర్మ 33 పరుగుల వద్ద ఎల్‌బీడబ్ల్యూ అయ్యాడు.

ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కోహ్లీతో ధవన్ మంచి పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పాడు. రెండో వికెట్‌కి వీరిద్దరూ 61 పరుగులు జోడించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ ఔట్ అయ్యాడు. ధవన్ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రిషబ్ పంత్ 4 పరుగులే చేసి మరోసారి విఫలమయ్యాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. సఫారీలను ధీటుగా ఎదురుకుంటూ హాఫ్ సెంచరీ దాటాడు. ఇదే క్రమంలో 52 బంతుల్లో 72 పరుగులు చేశాడు. ఆఖర్లో శ్రేయాస్ అయ్యర్ కోహ్లీకి చక్కటి సహకారం అందిస్తూనే.. 19వ ఓవర్‌ ఆఖరి బంతికి ఫోర్‌తో గెలుపు లాంఛనాన్ని పూర్తి చేశాడు.

టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. హెండ్రిక్స్‌తో కలిసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ని డికాక్ ఆరంభించాడు. ఫస్ట్ పవర్ ప్లేలోనే బౌండరీ మోత మోగించాడు డికాక్. నవదీప్ సైనీ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాదిన డికాక్.. తన బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం ఏమీ పడలేదని చూపించాడు. హాఫ్ సెంచరీ దాటాక మరింత ప్రమాదకరంగా మారుతుండటంతో.. జట్టు స్కోరు 88 వద్ద పరుగుల వద్ద డికాక్‌ను సైనీ బోల్తాకొట్టించాడు. చాహర్ బౌలింగ్‌లో హెండ్రిక్స్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన బవుమా కూడా దూకుడుగా ఆడటంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు సాధించేలా కనిపించినా 149 పరుగులే చేయగలిగింది. 

భారత బౌలర్లలో దీపక్ చాహర్ రెండు వికెట్లు పడగొట్టగా.. నవదీప్ షైనీ, జడేజా, హార్దిక్ పాండ్య తలో వికెట్ తీశారు. మూడు టీ-20 సిరీస్‌లో ధర్మశాలలో మొదటి టీ20 వర్షం కారణంగా రద్దైంది. ఇక మూడో టీ 20 సెప్టెంబర్ 22వ తేదీ ఆదివారం బెంగళూరులో జరుగుతుంది. 
Read More : డికాక్ హాఫ్ సెంచరీ, భారత టార్గెట్ 150