WTC final: మూడో రోజు కివీస్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌ స్కోరు 101/2

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ కంటే మెరుగ్గా రాణిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 217 రన్స్‌కు ఆలౌట్‌ చేయగా.. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది.

WTC final: మూడో రోజు కివీస్‌దే పైచేయి.. న్యూజిలాండ్‌ స్కోరు 101/2

WTC final

WTC final, Day 3: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ భారత్‌ కంటే మెరుగ్గా రాణిస్తోంది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 217 రన్స్‌కు ఆలౌట్‌ చేయగా.. తర్వాత బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్లు టామ్‌ లాథమ్‌, డెవాన్‌ కాన్వే ఆరంభంలో అదరగొట్టడంతో.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి పార్ట్‌నర్‌షిప్‌‌ని అశ్విన్‌ బ్రేక్ చేశాడు. 34.2 ఓవర్‌ దగ్గర ఓ చక్కటి బంతితో లాథమ్‌ను బోల్తా కొట్టించాడు.

ఆ తర్వాత వచ్చిన కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ తనదైన శైలిలో నిలకడగా ఆడుతూ కాన్వేకు సహకారం అందించాడు. ఈ క్రమంలోనే కాన్వే అర్థశతకం పూర్తి చేసుకున్నారు. ఇషాంత్‌ వేసిన 49వ ఓవర్‌లో లెగ్‌సైడ్‌ వెళ్లే బంతిని షాట్‌ ఆడబోయి షమి చేతికి చిక్కాడు కాన్వే. దీంతో న్యూజిలాండ్‌ 101 పరుగుల దగ్గర రెండో వికట్ కోల్పోయింది. అదే సమయంలో బ్యాడ్ లైట్ కారణంగా అంఫైర్లు ఆటను నిలిపివేశారు. విలియమ్సన్‌, రాస్‌ టేలర్‌ ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 116 పరుగులు వెనుకంజలో నిలిచింది. భారత బౌలర్లలో అశ్విన్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ తీశారు.

అంతకుముందు భారత్‌ 146/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను కొనసాగించగా మరో 71 పరుగులు చేసి మిగతా ఏడు వికెట్లు కోల్పోయింది. వైస్‌ కెప్టెన్‌ రహానె, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. కివీస్‌ పేసర్‌ కైల్‌ జేమీసన్‌ ఐదు వికెట్లతో చెలరేగగా మరో ఎండ్‌లో నీల్‌ వాగ్నర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, టిమ్‌ సౌథీ కట్టుదిట్టంగా బంతులేశారు. తొలుత మైదానం తడిగా ఉండటంతో ఆట అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. దాంతో పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న జేమీసన్‌ బంతిని స్వింగ్‌ చేస్తూ కోహ్లీ, పంత్‌ను స్వల్ప వ్యవధిలో ఔట్‌చేశాడు.

అనంతరం రహానె, జడేజా కాసేపు వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశారు. అయితే, పరుగుల వేగం పెంచే క్రమంలో వైస్‌ కెప్టెన్‌ అర్ధశతకానికి ఒక్క పరుగు దూరంలో వాగ్నర్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్‌ ధాటిగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్‌ 200 దాటాక అతడు సౌథీ బౌలింగ్‌లో లాథమ్‌కు చిక్కాడు. దాంతో భారత్‌ 211/7 స్కోరుతో భోజన విరామానికి వెళ్లింది. ఇక రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే ఇషాంత్‌, బుమ్రా, జడేజా ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.