యాప్ వాటర్ మీటర్ : అభినందించిన కేటీఆర్

  • Published By: madhu ,Published On : May 11, 2019 / 03:19 AM IST
యాప్ వాటర్ మీటర్ : అభినందించిన కేటీఆర్

ఒక రోజు మీకు ఎన్ని నీళ్లు కావాలో సెలక్ట్ చేసుకోండి..అంతే నీళ్లు వస్తాయి. ఒక యాప్ ద్వారా ఇది సాధ్యమౌతుంది. దీనివల్ల నీటి వృధాను అరికట్టవచ్చు. దీనిని రూపొందించిన వారు వేరే దేశానికి చెందిన వారు మాత్రం కాదు. తెలంగాణ వాసి. వాటర్ మీటర్ రూపొందించిన ఈ విద్యార్థిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ జిల్లా కలెక్టర్ డెమోకు రావాలని సూచించారు. 

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్‌కు చెందిన మిట్టపెల్లి సందీప్ అనంత సాగర్‌లోని ఎస్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. నీటి వృధాను అరికట్టడానికి ఏదైనా పరికరం తయారు చేయాలని స్నేహితులైన శశి ప్రీతమ్, శ్రీ విద్య, సాయితేజలతో ప్రయత్నం చేశాడు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఒక వాటర్ మీటర్‌ను రూపొందించారు. దీనిని ఒక యాప్‌కు అనుసంధానం చేశారు. ఎన్ని నీళ్లు కావాలనేది ఈ యాప్ ద్వారా సెలెక్ట్ చేసుకుంటే..అన్ని నీళ్లు మాత్రమే వస్తాయి.

2018 సెప్టెంబర్‌లో నిట్ వరంగల్ జరిగిన వాటర్ మీటర్‌ను ప్రదర్శించి ఫైనల్‌కు చేరుకున్నారు. అనంతరం అక్టోబర్‌లో హైదరాబాద్‌ జేఎన్‌టీయూలో జరిగిన ఫైనల్స్‌లోనూ నాలుగో స్థానంలో నిలిచారు. 2019 మార్చి హైదరాబాద్‌లో జరిగిన ట్రై గ్రాడ్ గ్లోబల్ ఈవెంట్‌లో విద్యార్థి బృందం పాల్గొని ఫైనల్‌కు చేరుకుంది. దీనివల్ల TSICతో విద్యార్థుల బ‌ృందానికి సంబంధాలు పెరిగాయి. ఎలవేటర్ పిచ్ వీడియో‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు సందీప్. ఇది ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్పాడు. ఈ వీడియోను కేటీఆర్ చూశారు. సందీప్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. మే 12, 13 తేదీల్లో డెమోకు రావాలని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌..విద్యార్థి బృందాన్ని ఆహ్వానించారు.