AAP Telangana : ఫుల్ జోష్‌‌లో ఆప్.. తెలంగాణపై ఫోకస్, త్వరలో పాదయాత్రలు

దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్లు.. దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆప్ పార్టీని విస్తరించాలని చూస్తున్నామని...

AAP Telangana : ఫుల్ జోష్‌‌లో ఆప్.. తెలంగాణపై ఫోకస్, త్వరలో పాదయాత్రలు

Aap Tg

AAP Party Target Telangana : ఆప్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటికే దేశ రాజధానిలో ప్రభుత్వం చెలాయిస్తున్న ఆ పార్టీ తాజాగా.. పంజాబ్ రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. తాజాగా.. ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వైపు ఆప్ చూస్తోంది. ఇక్కడ కూడా పాగా వేయాలని ప్లాన్స్ రచిస్తోంది. అందులో భాగంగా కార్యచరణను సైతం ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల ఇన్ ఛార్జీగా ఉన్న ఆ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి మీడియాతో మాట్లాడారు. తెలంగాణాలో ఏప్రిల్ 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలు, సీఎం కేసీఆర్ వైఫల్యాలపై పోరాడాలని నిర్ణయించినట్లు, పంజాబ్ రాష్ట్రంలో గెలుపుతో తమలో నూతనోత్సాహం వచ్చిందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలో పంజాబ్ లో భారీ మెజార్టీతో గెలవడం జరిగిందని గుర్తు చేశారు.

Read More : Bhagwant Mann : ఆప్ అధినేత కేజ్రీవాల్ తో భగవంత్ మాన్ భేటీ.. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ

ధర్మం, జాతి పేరిట విద్వేషాలు రెచ్చగొట్టే పార్టీలకు ఇది గుణపాఠంగా అభివర్ణించారాయన. దేశవ్యాప్తంగా తమ పార్టీకి ఆదరణ పెరుగుతున్నట్లు.. దక్షిణ భారతదేశం నుంచి వేల సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణలో ఆప్ పార్టీని విస్తరించాలని చూస్తున్నామని, పంజాబ్ ఉన్న పరిస్థితులు తెలంగాణలో కూడా ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం మొత్తం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. 60 సంవత్సరాల పోరాటం… అనేక మంది ఆత్మబలిదానాలు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అయితే సీఎం అయిన తర్వాత రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారని విమర్శించారు. 2014 ఎన్నికల హామీలలో దళిత ముఖ్యమంత్రి చేస్తానని, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు..దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని.. ఇలాంటి ఎన్నో మాటలు తప్పారన్నారు.

Read More : Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

తెలంగాణ రైతులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారు.. అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో చాలా మంది విద్యావంతులు నిరుద్యోగులుగా మిగిలిపోయారనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 80 వేల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి.. ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారో ఇంతవరకు చెప్పలేదన్నారు. యూనివర్సిటీలో 1330 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, రాష్ట్ర బడ్జెట్ ని దుర్వినియోగం చేయడంలో కేసీఆర్ పీహెచ్ డీ చేశారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఎడ్యుకేషన్, హెల్త్ పాలసీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నట్లు కానీ తెలంగాణలో మాత్రం ఈ పాలసీలు లేవన్నారు. కరోనా కాలంలో పని చేసిన 600 మందికి పైగా డాక్టర్లను తీసేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోందని వారికి మద్దతుగా ఆప్ పార్టీ పోరాడుతుందన్నారు. ఇక ఢిల్లీలో ఇచ్చిన హామీలను సీఎం అరవింద్ నెరవేరుస్తున్నట్లు… బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పనుల గురించి ఢిల్లీలో వీడియోల రూపంలో ప్రచారం చేయడం జరిగిందన్నారు. పంజాబ్ రాష్ట్రంలో అవినీతి ఉందని, ఇప్పుడు ఆప్ గెలిచిన తర్వాత అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు సోమ్ నాథ్ భారతి.