ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, దుబ్బాకలో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయం

  • Published By: naveen ,Published On : November 24, 2020 / 05:40 PM IST
ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్, దుబ్బాకలో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయం

bjp mlc elections: రాష్ట్ర వ్యాప్తంగా దుబ్బాక ఉప ఎన్నిక ఉత్కంఠ రేపింది. ఈ ఫలితం త్వరలో జరగబోయే నల్గొండ-వరంగల్‌-ఖమ్మం, హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్ర ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంచనాలు వేస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితం తమ పార్టీకి అనుకూలంగా రావడంతో కమలనాథులంతా ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. దుబ్బాకలో అనుసరించిన వ్యూహాలను అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

టీఆర్ఎస్ ను ఓడించేందుకు కోదండరామ్ కు మద్దతిస్తారని ప్రచారం:
2015 ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ-వరంగల్‌-ఖమ్మంలో రెండో స్థానంలో నిలిచిన బీజేపీ… మొన్నటి వరకూ అంత యాక్టివ్‌గా లేదు. ఏదో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చింది. దుబ్బాక ఫలితంతో ఒక్కసారిగా జోరు పెంచిందని అంటున్నారు. తొలుత ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్న ప్రొఫెసర్ కోదండరామ్‌కు మద్దతిస్తారనే ప్రచారం జరిగింది. టీఆర్ఎస్‌ను ఓడించాలంటే ఆయనకు మద్దతివ్వడమే కరెక్ట్ అన్న లోపాయికారీ అవగాహనతోనే ఎన్నికలపై పెద్దగా దృష్టి పెట్టలేదని టాక్.

ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని నూకల విజ్ఞప్తి:
మరోవైపు మొన్నటి వరకు నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అంతర్గత కుమ్ములాటలతో పంచాయితీ రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరినా.. తాజా ఫలితాలతో అప్రమత్తమై అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ముందుకుపోవాలని రాష్ట్ర అధిష్ఠానం సూచించిందని అంటున్నారు. గతంలో వరంగల్‌ జిల్లా నేతకే పోటీ చేసే అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని నల్లగొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డి ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌కు వినతిపత్రం అందించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.

పోటీకి సై అంటున్న పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు:
మరోవైపు పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు పోటీకి సుముఖంగా ఉన్నారని పార్టీ నేతలు అంటున్నారు. దుబ్బాక ఫలితం వెలువడిన వెంటనే.. అదే రోజు రాత్రి పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేసే ఆశావహులు ఎవరనే దానిపై జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల అభిప్రాయాలను రాష్ట్ర పార్టీ నాయకుడొకరు సేకరించినట్లు సమాచారం. వీరిద్దరితో పాటు వరంగల్‌ జిల్లాకు చెందిన ఒకరు ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. మరో ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత వచ్చే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోదండరామ్‌కు మద్దతివ్వాలా? తామే అభ్యర్థిని నిలపాలా అనేది కూడా ఫైనల్‌ చేసేస్తారని సమాచారం.

బీజేపీలో జోష్, కాంగ్రెస్‌ లో నైరాశ్యం:
దుబ్బాక ఫలితం బీజేపీలో జోష్ నింపగా.. కాంగ్రెస్‌ను నైరాశ్యంలోకి నెట్టింది. సిట్టింగ్‌ స్థానమైన హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ను నిలుపుకోవడంతో పాటు గత ఎన్నికల్లో రెండోస్థానం సాధించిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ నియోజకవర్గాన్ని గెలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. వాస్తవానికి నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కోదండరామ్ ప్రకటించిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే తాము కోదండరాంకు మద్దతివ్వబోమని సొంతగానే పోటీలో ఉంటామని కాంగ్రెస్ ప్రకటించింది.

కన్ ఫ్యూజన్ లో కాంగ్రెస్:
దుబ్బాక ఎన్నికల బిజీలో ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టలేదని కాంగ్రెస్‌ చెబుతూ వచ్చింది. దుబ్బాకలో డిపాజిట్లు కోల్పోవడంతో ఆ పార్టీకి దిక్కు తోచడం లేదంటున్నారు. అదే సమయంలో బీజేపీ జోరు పెంచడమే కాదు.. అవసరమైతే టీఆర్ఎస్‌ను ఓడించేందుకు కోదండరామ్‌కు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉండడంతో రాజకీయాలు అనూహ్యంగా మారబోతున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉందని అంటున్నారు. కచ్చితంగా పోటీ చేయాలని పలువురు సీనియర్లు వాదిస్తున్నారు. మొత్తం మీద ఈ వ్యవహారాలన్నింటిపైనా ఓ క్లారిటీ రావడానికి కొద్ది రోజులు పడుతుందని భావిస్తున్నారు.