CM KCR: సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహం.. రంగంలోకి ప్రశాంత్ కిశోర్!

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్‌ ఇప్పటికే నుంచి అడుగులు వేస్తోందా..?

CM KCR: సీఎం కేసీఆర్ ఎన్నికల వ్యూహం.. రంగంలోకి ప్రశాంత్ కిశోర్!

CM KCR Focus on Upcoming Assembly Elections

CM KCR: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్‌ ఇప్పటికే నుంచి అడుగులు వేస్తోందా..? గులాబీ బాస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ టీమ్‌ తెలంగాణలో రంగంలోకి దిగడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ప్రశాంత్ కిశోర్ టీమ్ క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేసేందుకు రెడీ అవుతోంది.

2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటి నుంచే టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం వ్యూహాత్మకంగా ఎన్నికలకు అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై ఇప్పటికే కొంత సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి.. మరోసారి ప్రశాంత్ కిశోర్ టీమ్‌తో సమగ్ర సర్వే చేయించాలని నిర్ణయించారు.

ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందో తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో ఎంతవరకు సానుకూలత ఉందనే అంశంపై కూడా సమాచారం తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పీకే టీమ్‌తో కేసీఆర్‌, కేటీఆర్‌తో సమావేశం అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్ని కలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా గడువు ఉండగా.. ముందస్తు ఎన్నికలు ఉండబోవని ఓవైపు సంకేతాలు ఇస్తూనే, మరోవైపు ఎన్నికలు లక్ష్యంగా పార్టీని చక్కబెట్టాలని కేసీఆర్‌ నిర్ణయించారు. నిఘా వర్గాల నివేదికలు, వివిధ సర్వేల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేస్తున్నారు. చాలాచోట్ల విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షాలకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దుబాటు చర్యలు కూడా చేపట్టారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఎదుర్కొంటున్న సమస్యలు, లోపాలు, సంస్కరించుకోవాల్సిన అంశాలు.. ఎన్నికల నాటికి చక్కపెట్టుకోవాల్సిన విషయాలు.. ఇలా అన్నింటిపైనా ప్రశాంత్ కిశోర్‌ టీమ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయంపై ప్రభావం చూపించే ప్రతికూల అంశాలకు ఇప్పటి నుంచే చెక్ పెట్టే వ్యూహంలో భాగంగా కేసీఆర్…పీకే టీమ్‌తో కలిసి పనిచేస్తోంది.

తెలంగాణలో మొత్తం 119 మంది శాసనసభ్యులకు గాను.. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 103 మంది సభ్యుల బలం ఉంది. వీరిలో 65 మందికి పైగా ఎమ్మెల్యేలు వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. 30 మందికి పైగా సభ్యులు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు మినహా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిన కేసీఆర్‌ వచ్చే ఎన్నికల్లో యువత, కొత్తవారికి పెద్దపీట వేసేలా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.