కరోనా ముంచింది : భారీగా తగ్గనున్న తెలంగాణ ఆదాయం

  • Published By: madhu ,Published On : November 8, 2020 / 10:01 AM IST
కరోనా ముంచింది : భారీగా తగ్గనున్న తెలంగాణ ఆదాయం

Covid -19 Effect On Telangana Revenue : కరోనా ప్రభావం తెలంగాణ రాష్ట్ర ఆదాయంపై తీవ్రంగా పడిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా ఎఫెక్ట్‌తో ఈ ఏడాది రాష్ట్ర ఆదాయం 52వేల 720 కోట్లు తగ్గే అవకాశముందన్నారు. దీనికి అనుగుణంగా అధికారులు ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకోవాలని సూచించారు. తగ్గిన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు కేసీఆర్‌.



కరోనా నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్‌ అధికారులతో సమావేశమయ్యారు. 2020-21 బడ్జెట్‌పై మధ్యంతర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కరోనా ప్రభావంతో.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే ఆదాయం అన్ని విధాలా కలిసి 52,750 కోట్లు తగ్గనుందని వివరించారు. ఆదాయం భారీగా తగ్గే అవకాశమున్నందున 2020-21 బడ్జెట్ అంచనాల్లో మార్పులు, సవరణలు అనివార్యమని తెలిపారు.



తెలంగాణకు పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా కలిపి 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 39,608 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు వివరించారు. 2020-21లో మాత్రం ఈ ఏడు నెలల కాలంలో 33,704 కోట్ల రూపాయలే వచ్చాయన్నారు. వాస్తవానికి రాష్ట్ర ఆదాయ వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని అంచనా వేసి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించారు. కానీ, కరోనాతో… పెరగాల్సిన ఆదాయం పెరగక పోగా, గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది.



ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి పన్నుల ద్వారా, పన్నేతర మార్గాల ద్వారా కలిపి మొత్తం 67,608 కోట్ల ఆదాయం వస్తుందన్న అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందాయి. కానీ ఇప్పటి వరకు కేవలం 33,704 కోట్ల రూపాయలు మాత్రమే సమకూరాయి. దీంతో రాష్ట్రానికి వచ్చే స్వీయ ఆదాయం 33,904 కోట్లు తగ్గనున్నట్టు అధికారులు కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు.



తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లిన పన్నుల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా భారీగా తగ్గింది. తెలంగాణ రాష్ట్రానికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో 16,727 కోట్లను పన్నుల్లో రాష్ట్ర వాటాగా చెల్లిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీని ప్రకారం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు పన్నుల వాటా కింద 8,363 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 6,339 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే కేంద్ర నిధుల్లో దాదాపు 2,025 కోట్లకు కోతపడింది. 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కేంద్రం నుంచి రావాల్సిన 16,727 కోట్లకు గాను కేవలం 11,898 కోట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



ఇక వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కింద సెంట్రల్‌ గవర్నమెంట్‌ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లోనూ కేతపడే అవకాశముందని అధికారులు తెలిపారు. దాదాపు వెయ్యికోట్లు తగ్గే చాన్స్‌ ఉందని వివరించారు. తెలంగాణ ఆదాయం తగ్గనుండడంతో.. దానికి అనుగుణంగా ప్రాధాన్యతా క్రమాన్ని నిర్ధారించుకుని, ఆర్థిక నిర్వహణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.