Hyderabad Metro: మెట్రో ప్రయాణికుల పార్కింగ్ కష్టాలు.. ట్రాఫిక్ చలాన్లతో బెంబేలు

వరుస చలాన్లతో మెట్రో ప్రయాణికులు భయపడిపోతున్నారు. డబ్బు చెల్లించి తమ వాహనాలకు పార్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికుల పార్కింగ్ కష్టాలు.. ట్రాఫిక్ చలాన్లతో బెంబేలు

Hyderabad Metro Parking: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులు చలాన్ల కష్టాలు తప్పడం లేదు. మెట్రో స్టేషన్లలో సరిపడా పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులు చలాన్ల బారిన పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులకు భారీగా జరిమానాలు చెల్లించి జేబులు గుల్లచేసుకోవాల్సి రావడంలో మెట్రో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. పార్కింగ్ ఇక్కట్ల నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నారు. మెట్రో స్టేషన్లలో వాహనాలకు తగిన పార్కింగ్ సదుపాయం కల్పించాలని అభ్యర్థిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro)లో ప్రతిరోజు దాదాపు 4 లక్షల మందిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. తమ వ్యక్తిగత వాహనాలను మెట్రో స్టేషన్ల వద్ద ఉంచి మెట్రో రైలు ఎక్కుతుంటారు. అయితే వాహనాలను ఉంచేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో ప్రయాణికులు పార్కింగ్ (parking) కష్టాలు ఎదుర్కొంటున్నారు. నాగోల్, మియాపూర్ స్టేషన్లలో మాత్రమే ఉచిత పార్కింగ్ సదుపాయం ఉంది. మిగతా చోట్ల వాహనాలు పార్క్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే. ద్విచక్ర వాహనానికి గరిష్టంగా రూ.25, కార్లకు 50 రూపాయల వరకు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రతాపం
రద్దీ సమయాల్లో వాహనాలు పార్క్ చేయాలంటే ప్రయాణికులకు చుక్కలు కనబడుతున్నాయి. అన్ని మెట్రో స్టేషన్లలోనూ పార్కింగ్ నిండిపోతుంది. దీంతో చాలా మంది తమ వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలో తెలియక సతమతవుతున్నారు. ఇలాంటి పరిస్థిత్లుల్లో ప్రయాణికులు తమ వాహనాలను రోడ్డు పక్కన ఖాళీ ప్రదేశాల్లో పార్క్ చేస్తున్నారు. ఇదే అదునుగా ట్రాఫిక్ పోలీసులు తమ ప్రతాపం చూపిస్తున్నారు. వాహనాలకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. కొన్నింటిని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.

చలాన్లతో బెంబేలు
వరుస చలాన్లతో మెట్రో ప్రయాణికులు భయపడిపోతున్నారు. డబ్బు చెల్లించి తమ వాహనాలకు పార్క్ చేసేందుకు సిద్ధంగా ఉన్నా సరిపడా స్థలం లేకపోవడంతోనే రోడ్డు పక్కన పెట్టాల్సి వస్తోందని మెట్రో ప్రయాణికులు అంటున్నారు. పార్కింగ్ సదుపాయం ఉంటే తాము ఎందుకు రోడ్డు ప్రక్కన వాహనాలు పార్క్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పార్కింగ్ కష్టాలు, చలాన్ల బాదుడు నుంచి విముక్తి కల్పించాలని అధికారులను కోరుతున్నారు.

Also Read: అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ లో ఇదీ పరిస్థితి.. కేటీఆర్ కు ప్రయాణికుడి ట్వీట్

బాదుడే బాదుడు
హైదరాబాద్, రాచకొండ, సైబారాబాద్ కమిషనరేట్స్ లలోని మెట్రో స్టేషన్(Metro Station) వద్ద ట్రాఫిక్ పోలీసుల చలాన్ల బాదుడు కొనసాగుతోంది. దీంతో మెట్రో స్టేషన్ల నుంచి ట్రాఫిక్ పోలీసులకు కాసుల వర్షం కురుస్తోంది. నగరంలోని అన్ని మెట్రో స్టేషనంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్బీనగర్, మియాపూర్ మధ్య పరిస్థితి మరీ దారుణంగా ఉందని ప్రయాణికులు అంటున్నారు. ఎల్బీనగర్, చైతన్యపురి, విక్టోరియా, దిల్ షుఖ్ నగర్, మెట్టుగూడ(Mettuguda), తార్నాకా ప్రాంతాల్లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రైవేటు వ్యక్తులు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.