తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్‌గా కరీంనగర్

తెలంగాణ రాజకీయాలకు కేరాఫ్‌గా కరీంనగర్

Karimnagar as a Care of for Telangana politics : తెలంగాణా రాజకీయాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. రాష్ట రాజకీయాల్లో క‌రీంన‌గ‌ర్ ఉమ్మడి జిల్లా నాయకుల హవా పెరిగిపోతోంది. స‌మైఖ్య రాష్ట్రంలోనూ సీఎం, కేంద్ర మంత్రి పదవుల నుండి…ప్రధాన మంత్రి దాకా ఈ జిల్లా నేతలు పదవులు చేపట్టారు. నేటి తరం నేతలు సైతం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ప్రధాన పార్టీలైన BJP, TDP, CPI అధ్యక్షులంతా క‌రీంన‌గ‌ర్‌కు చెందిన వారే. TRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTRది కూడా అదే జిల్లా. తాజాగా TPCC అధ్యక్ష పదవి సైతం క‌రీంన‌గ‌ర్ జిల్లాకే ఖాయ‌మైన‌ట్లు తెలుస్తోంది.

జిల్లాలో ఏ పార్టీ పైచేయి సాధిస్తే అదే పార్టీకి అధికారం ఖాయ‌మ‌నే సెంటిమెంట్ మొద‌లైంది. దీంతో పదవుల కేటాయింపులో…అన్ని పార్టీలు జిల్లా నేతలకు పెద్దపీట వేస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నాయకులే…ప్రధాన రాజకీయ పార్టీలకు రాష్ట్ర సారధులుగా చ‌క్రం తిప్పుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ TRS వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

యువ నాయకుడిగా…పార్టీ కార్య నిర్వాహ‌క అద్యక్షుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు KTR. త్వరలోనే సీఎం పీఠంపై కూర్చోబోతున్నారన్న ప్రచారం జిల్లాలో జోరుగా సాగుతోంది. గ‌తంలో క‌రీంన‌గ‌ర్ జిల్లాకు చెందిన‌ పీవీ న‌ర్సింహారావు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే సీయం KCRసైతం క‌రీంన‌గ‌ర్ కేంద్రంగానే ఉద్యమాన్ని ఉర‌కలెత్తించారు. క‌రీంన‌గ‌ర్ నుండే ఎంపీగా మూడు సార్లు ఎన్నికై చ‌రిత్ర సృష్టించారు.

ప్రస్తుత కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కి బీజేపీ అధిష్ఠానం కొన్ని నెలల క్రితం రాష్ట్ర పార్టీ పగ్గాలను అప్పగించింది. ఉమ్మడి ఏపీలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా జిల్లాకు చెందిన చెన్నమనేని విద్యాసాగరరావు వ్యవహరించారు. అప్పట్నుంచి గ్రేటర్‌ పరిధిలోని నేతలే బీజేపీ అధ్యక్షులుగా ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత కరీంనగర్‌ జిల్లాకు చెందిన బండి సంజయ్‌కు రాష్ట్ర పార్టీ బాధ్యతలు దక్కాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో సంజయ్‌ దూకుడు కమలానికి కలసివచ్చింది. సంజయ్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఇప్పుడు బీజేపీ కనిపిస్తోంది.

కరీంనగర్ జిల్లాకు చెందిన ఇందుర్తి మాజి ఎమ్మెల్యే చాడ వెంకట్ రెడ్డి CPI రాష్ట్ర కార్యదర్శిగా, జగిత్యాలకు చెందిన ఎల్.రమణ తెలంగాణ టిడిపి అద్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఇప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ పగ్గాలను సైతం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించ‌డం దాదాపు ఖాయమైంది. పీసీసీ పీఠం రేసులో చాలామంది నేతల పేర్లు పరిగణలోకి తీసుకున్నప్పటికీ అనూహ్యంగా జీవన్‌రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

6సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన జీవన్ రెడ్డి…టీడీపీ,కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. టీపీసీసీ పదవి కూడా జిల్లాకు చెందిన జీవన్ రెడ్డినే వ‌రించ‌డం దాదాపు ఖాయం కావ‌డంతో … రాష్ట్రంలో ప్రధాన పార్టీల రాజ‌కీయాల‌కు క‌రీంన‌గ‌ర్ కేంద్రంగా మారడం ఖాయంగా క‌న్పిస్తోంది.