బీజేపీ టార్గెట్ : టీఆర్ఎస్ ‘హనుమాన్’ అస్త్రం

వజ్రాన్ని..వజ్రంతోనే కోయాలంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకునట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణలో గులాబీ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీని ఓవర్‌టేక్ చేసేందుకు విరుగుడును కనిపెట్టడమే కాకుండా.... ఢీ అంటే ఢీ అంటోంది.

బీజేపీ టార్గెట్ : టీఆర్ఎస్ ‘హనుమాన్’ అస్త్రం

Hanuman Chalisa

Hanuman Chalisa : ఉత్తర తెలంగాణలో పట్టు సడలకుండా టీఆర్ఎస్ వ్యూహరచన చేసిందా..? ఆ పార్టీ నేతలు కొండగట్టు అంజన్న క్షేత్రం నుంచి హిందూ రాజకీయం చేయబోతున్నారా? బీజేపీపై టీఆర్ఎస్ ఎక్కు పెట్టిన హనుమాన్ అస్త్రం వెనుక అసలు మతలబు ఏంటి? వజ్రాన్ని..వజ్రంతోనే కోయాలంటారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఎంచుకునట్టు కనిపిస్తోంది టీఆర్ఎస్. తెలంగాణలో గులాబీ పార్టీతో కయ్యానికి కాలుదువ్వుతున్న బీజేపీని ఓవర్‌టేక్ చేసేందుకు విరుగుడును కనిపెట్టడమే కాకుండా…. ఢీ అంటే ఢీ అంటోంది. బీజేపీని దెబ్బకొట్టాలంటే ఆ పార్టీ ఎంచుకున్న మార్గంలోనే వెళ్లాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకు గులాబీ బాస్ ఎమ్మెల్సీ కవితను రంగంలోకి దింపారనే చర్చ జరుగుతోంది. బీజేపీ జైశ్రీరాం నినాదానికి పోటీగా జై హనుమాన్ అనే పల్లవిని టీఆర్ఎస్ ఎత్తుకుంది. ఇందుకోసం ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వేదికగా…టీఆర్ఎస్ వ్యుహం అమలు చేయబోతుందని విశ్లేషిస్తున్నారు.

హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నిర్ణయించినట్టు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. కొండగట్టులో చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా మొదలు పెట్టనున్నట్టు చెప్పారు. అయితే కవిత చేపడుతున్న హనుమాన్ పారాయణంతో టీఆర్ఎస్ జై హనుమాన్ నినాదాన్ని ఎత్తుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం బీజేపీ పరివార సంస్థలు ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ గ్రామీణ ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. జై శ్రీరామ్ నినాదం గ్రామీణ ప్రాంతాల్లో మారుమ్రోగడంతో బీజేపీకి పరోక్షంగా రాజకీయ ప్రయోజనం చేకూరిందంటున్నారు.

అయితే గ్రామీణ ప్రాంతాల్లో జై హనుమాన్ పేరిట బీజేపీకి కౌంటర్ ప్రచారం నిర్వహించాలని టీఆర్ఎస్ కార్యాచరణ సిద్దం చేసింది. ఇందులో భాగంగానే చిన్న హనుమాన్, పెద్ద హనుమాన్ జయంతిల సందర్భంగా 41 రోజుల చొప్పున 82 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని నిర్ణయించారు. ఉత్తర తెలంగాణలో కొండగట్టు ఆంజనేయ స్వామిని లక్షలాది మంది ఇంటి ఇలవేల్పుగా భావిస్తారు. ఇక్కడ ముడుపు కడితే ఓటమి ఉండదని భక్తుల విశ్వాసం. అయితే ఈ ఆలయానికి గతంలో పెద్దగా రాని నేతలంతా… ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలన్నీ టీఆర్ఎస్‌కు లాభం చేకూరుస్తాయంటున్నారు. టీఆర్ఎస్ నిర్ణయంతో రానున్న రోజుల్లో జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతోనే పల్లె రాజకీయం హోరెత్తనున్నట్టు కనిపిస్తోంది.