నీటి లెక్కలు తేలేనా : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం

నీటి లెక్కలు తేలేనా : కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం

krishna river management board : కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ భేటీ కానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలజగడాలు, నీటి పంపకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనుంది. హైదరాబాద్‌లో జరగనున్న ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌లూ పాల్గొననున్నారు. 2021-22 సంవత్సరానికి సంబంధించి నీటి వాటాలపై త్రిసభ్య కమిటీ తేల్చేయనుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు నుంచి కృష్ణా, గోదావరి జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో ప్రధానంగా కృష్ణానది జల వివాదాలు ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్న కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డ్ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జలాలను తరలించుకునేందుకు ఏపీ ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తోందంటున్న తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తోంది.

10 లేఖలు : –
ఇప్పటివరకు దాదాపు తెలంగాణ నీటిపారుదల శాఖ 10 లేఖలు రాసింది. అయినా… అవి పరిష్కారానికి నోచుకోలేదు. చివరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గజేంద్ర సింగ్ షెకావత్‌కు లేఖలు రాయడంతో పాటు ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లి కలిసినా సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారాయి. కృష్ణా జలాల్లో రాష్ట్రాల వాటాను ట్రిబ్యునల్‌ ఇప్పటికే నిర్ణయించింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలుగా నిర్ణయించారు. పంపకాల మొత్తాలకు మించి ప్రవహించే అదనపు జలాలను పూర్తిగా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చారు. అయితే ఈ అదనపు జలాలపై హక్కును మాత్రం ఆంధ్రప్రదేశ్ పొందలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… ఉమ్మడి రాష్ట్రానికి వచ్చిన 811 టీఎంసీల నీటిలో.. ఏపీకి 58 శాతం అంటే 512 టీఎంసీలు, తెలంగాణకు 42 శాతం అంటే 299 టీఎంసీల నీటి కేటాయింపులు చేశారు. అదే విధంగా ఈ ఏడాది వాడుకోని నీటిని వచ్చే సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేయాలని తెలంగాణ మొదటినుంచి కోరుతోంది. పూర్తిస్థాయిలో దీని పైన ఒక నిర్ణయం ఇప్పటివరకు జరగలేదు.

ఏపీ నుంచి రాని స్పందన : –
నీటి కేటాయింపుల విషయంలో ఇప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం కుదరడం లేదు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిని బేస్ చేసుకొని కొత్త ప్రాజెక్టులకు తెరలేపుతోంది. పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర, హంద్రీనీవా ప్రాజెక్టులను కట్టడం, సామర్థ్యం పెంపు వంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. తెలంగాణ జలవనరుల శాఖ ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు పలు లేఖలు రాసింది. ఆ లేఖలను యథాతథంగా కోట్ చేస్తూ ఏపీ జలవనరుల శాఖకు వివరణ ఇవ్వాల్సిందిగా కృష్ణా బోర్డు లేఖలు రాసింది. అయితే ఈలేఖలకు ఏపీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన రాలేదు.

8 ప్రాజెక్టులపై అభ్యంతరాలు : –
మరోవైపు కృష్ణ నదిపై అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఏపీ సర్కార్‌ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. మొత్తం 8 ప్రాజెక్టులపై అభ్యంతరాలు లేవనెత్తింది. 5 కొత్త ప్రాజెక్టులు, 3 ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల పేర్లను ప్రస్తావించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, మిషన్ భగీరథ, తుమిళ్లతో పాటు కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టులకు అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదని ఏపీ ఫిర్యాదులో పేర్కొంది. ఏపీ జలవనరుల శాఖ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సంబంధించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించాలని కోరింది.

త్రిసభ్య కమిటీ భేటీ : –
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ జలవనరుల శాఖ రాసిన లేఖల విషయంలో కృష్ణా బోర్డు అధికారులు పోస్ట్ మెన్ జాబ్ చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. త్రి సభ్య కమిటీ భేటీలోనైనా కృష్ణా జల వివాదాన్ని పరిష్కరించాలని నీటి రంగ నిపుణులు కోరుతున్నారు.