Land Registrations: తెలంగాణలో జోరుగా భూముల రిజిస్ట్రేషన్స్

తెలంగాణలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నెల రోజుల వ్యవధిలో 75,236 లావాదేవీలు జరిగాయి.

Land Registrations: తెలంగాణలో జోరుగా భూముల రిజిస్ట్రేషన్స్

Land Registrations Huge

Land Registrations: తెలంగాణలో భూములు, ఆస్తుల క్రయ, విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా నెల రోజుల వ్యవధిలో 75,236 లావాదేవీలు జరిగాయి. సాధారణ సమయాల్లో జరిగినట్లే కరోనా సమయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం కురుస్తుంది.

రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ. 382.64 కోట్ల ఆదాయం సమకూరగా, చలాన్ల రూపంలో మరో రూ. 200 కోట్లు వచ్చాయి. కరోనాకు ముందు రోజుకు 4 వేల నుంచి 5 వేల వరకు రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగేవి. ఇప్పుడు కూడా అదే సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ నెలలో సెలవు రోజులను మినహాయిస్తే సాధారణ రోజుల్లో జరిగిన సంఖ్యలోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

మళ్లీ లాక్ డౌన్ పెడతారనే వార్తలు చక్కర్లు కొడుతుండటంతో రియల్టర్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కరోనా ఉధృతి నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు ముగిశాక ఏ క్షణమైనా ప్రభుత్వం లాక్‌డౌన్‌ పెట్టే అవకాశముందని రియల్టర్లు, కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు మార్కెట్‌ విలువల సవరణ ప్రక్రియ కూడా రియల్‌ లావాదేవీలు పెరగడానికి కారణమని తెలుస్తోంది.

ఇప్పటికే మార్కెట్ విలువల సవరణ నూతన విధానం అమలు కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన అమలు కాలేదు. ఏప్రిల్ ఒకటి నుంచే కొత్త విధానం అమలులోకి వస్తుందని ప్రచారం కూడా జరిగింది. మరోవైపు ప్రభుత్వం ఈ ఏడాది స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12000 కోట్ల ఆదాయం రాబట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. మార్కెట్ విలువల విధానంలో మార్పులు చేస్తే కానీ ఇది సాధ్యపడదు.. ఇవ్వన్నీ దృష్టిలో పెట్టుకొని మార్కెట్ విలువ పెంచకముందే చాలామంది రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్నారు.

అలాగే రియల్‌ ఎస్టేట్‌ రంగం మళ్లీ పుంజుకోవడం కూడా లావాదేవీలు పెరిగేందుకు కారణమని రిజిస్ట్రేషన్ల అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు క్రయ, విక్రయ లావాదేవీల నిమిత్తం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో అన్ని రకాల కోవిడ్‌ నిబంధనలను రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తోంది.