ప్రజలు వరదలతో అల్లాడుతున్నప్పుడు కేంద్రమంత్రులు ఎక్కడ ఉన్నారు : బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

  • Published By: bheemraj ,Published On : November 26, 2020 / 05:54 PM IST
ప్రజలు వరదలతో అల్లాడుతున్నప్పుడు కేంద్రమంత్రులు ఎక్కడ ఉన్నారు : బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

ktr serious over bjp : బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వస్తున్న కేంద్ర మంత్రులు ప్రజలు వరదలతో అల్లాడుతున్నప్పుడు ఎక్కడ ఉన్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కర్నాటకలో వరదలొస్తే 4 రోజుల్లో ప్రధాని రూ.600 కోట్లు విడుదల చేశారని పేర్కొన్నారు.



జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేస్తే ప్రతీ ఒక్కరి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తామన్నారని..వేశారా అని ప్రశ్నించారు. రూ.15 లక్షలు వచ్చినోళ్లు మోడీకి ఓటేయండి..రానివాళ్లు టీఆర్ఎస్ కు ఓటేయండి అని అన్నారు. గురువారం అల్వాల్ చౌరస్తాలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా విమర్శించారు. బీజేపీ నేతలకు దేశాన్ని అభివృద్ధి ఎలా చేయాలో తెలియదన్నారు. బీజేపీ నేతలకు తెలిసిందల్లా హిందూ, ముస్లీం ఒక్కటేనని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ప్రజల్లో ఉద్వేగాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు కావాల్సింది ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలన్నారు.



టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఆరేళ్ల పాలనలో ఎన్నో సమస్యలను అధిగమించామని పేర్కొన్నారు. అమెజాన్, ఆపిల్, గూగుల్ కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయని వివరించారు.

హైదరాబాద్ అభివృద్ధికి బీజేపీ, కాంగ్రెస్ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 6 ఏళ్లలో 2 లక్షల 72 వేల కోట్లు పన్ను రూపంతో కేంద్రానికి కట్టామని చెప్పారు. కేవలం రాష్ట్రానికి ఇచ్చింది కేవలం లక్షా 40 వేల కోట్లు మాత్రమే అన్నారు.



వరదలతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.10 వేల సాయం ప్రకటించారని తెలిపారు. రూ.10 వేల సాయాన్ని ఆపింది ఎవరో ప్రజలు గ్రహించాలన్నారు. ఎన్నికల తర్వాత రూ.10 వేల సాయాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. బల్దియాలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఆడబిడ్డలు ఆందోళన చెందవద్దు, అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.