ఎమ్మెల్సీ గారు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టేనా?

  • Published By: sreehari ,Published On : July 16, 2020 / 11:19 PM IST
ఎమ్మెల్సీ గారు టీఆర్ఎస్‌లో చేరుతున్నట్టేనా?

ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆయన పార్టీ మారుతున్నారని కొందరు… మా పార్టీలోకి ఎవరు రావడం లేదని మరికొందరు ప్రకటనలు చేస్తున్నారు. అసలు ప్రేం సాగర్‌రావు టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ, ఆయన్ను రాకుండా అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దివంగత వైఎస్‌ఆర్‌ హయాంలో ఎమ్మెల్సీగా ఉన్న ప్రేంసాగర్ రావు… కొన్నాళ్లపాటు చక్రం తిప్పారు. ఉమ్మడి జిల్లాను తన కనుసైగలతో గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు.

పూర్వ వైభవం కోసమే ఈ తిప్పలా? :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో సిర్పూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లోనూ మంచిర్యాల నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఒక వెలుగు వెలిగిన ప్రేమ్‌సాగర్‌రావు.. వరుస ఓటములతో రాజకీయ భవిష్యత్‌పై ఆలోచనలో పడినట్లు ఆయన అనుచరులు గుసగుసలాడుతున్నారు. అధికార పార్టీలోకి వెళ్లి పూర్వవైభవం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. పనిలోపనిగా టీఆర్‌ఎస్‌లో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అని ఆశలు పెట్టుకున్నట్లు ఊరంతా అనుకుంటున్నారు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతారా? :
ప్రేమ్‌సాగర్‌రావు.. టీఆర్‌ఎస్‌లో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తల్ని ఆయన అనుచరులు కూడా కొట్టేకపోవడంతో… మరింత బలం చేకూరింది. అయితే కాంగ్రెస్‌కు ఎందుకు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. టీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆయన్ను ఎవరు ఆహ్వానిస్తున్నారో కూడా తెలియట్లేదని టాక్‌ వినిపిస్తోంది.

ప్రేమ్‌సాగర్‌రావును గులాబీ కండువా కప్పుకోబోతున్నారని గతంలోనూ జోరుగా ప్రచారం సాగింది. కానీ, అది ఒట్టి పుకారుగానే మిగిలిపోయింది. తాజాగా మరోసారి ప్రచారం ఊపందుకోవడంతో… ఏది నిజమో తెలియక రెండు పార్టీల నేతలు కన్ఫ్యూజన్‌లో పడినట్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు ప్రేమ్‌సాగర్‌రావుకు గులాబీ పార్టీలో రెడ్‌ కార్పెట్‌ లేదని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

అయోమయంలో కేడర్ :
ఆయన రాకను టీఆర్‌ఎస్‌లోని కొందరు వ్యతిరేకిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఎంటరైతే జిల్లాలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తాడని… మనపై పెత్తనం చేసే వ్యక్తిని తెచ్చుకోవడం అవసరమా అంటూ కొందరు నేతలు భావిస్తున్నారట. ఈ మాట జిల్లాలోని అన్ని గ్రామాల్లో గట్టిగానే వినిపిస్తోంది. మొత్తానికి ప్రేమ్‌సాగర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరతారా, లేదా అంటే… ఎవర్నుంచీ కరెక్ట్‌ ఆన్సర్‌ లేదు. కాంగ్రెస్‌లో కత్తిలాంటి వ్యక్తికి.. టీఆర్‌ఎస్‌లో పదునెందుకు లేదో.. వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ సీటుపై కన్నేసిందెవరో తెలియక రెండు పార్టీల కేడర్‌లో అయోమయం నెలకొందని టాక్‌ వినిపిస్తోంది.