కరోనా కల్లోలానికి నాగార్జున సాగర్ సభే కారణమా?

కరోనా కల్లోలానికి నాగార్జున సాగర్ సభే కారణమా?

Nagarjuna Sagar Meeting Breaks Corona Second Wave In Telangana

Nagarjuna Sagar Meeting: కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా చివరకు కరోనా వదల్లేదు. నాగార్జునగర్‌ ఉపఎన్నిక సంధర్భంగా.. టీఆర్‌ఎస్‌ అధినేత, కేసీఆర్‌ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్‌ విజృంభణకు కేంద్రంగా నిలిచింది. ఈ సభలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు.. సాగర్‌ అభ్యర్థి నోముల భగత్‌కు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులకు కరోనా సోకినట్లుగా అర్థం అవుతోంది.

బహిరంగ సభకు హాజరైన వారిలో చాలామందికి వైరస్‌ సోకినట్లు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో 160 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవ్వగా.. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉపఎన్నిక వచ్చింది. ఈనెల 17వ తేదీన ఉపఎన్నిక ఉండగా.. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్‌ఎస్‌.. సీఎం కేసీఆర్‌ను కూడా రంగంలోకి దింపింది. సీఎం కేసీఆర్.. ఏప్రిల్ 14వ తేదీన హాలియాలో‌ బహిరంగ సభ నిర్వహించారు.

ఆ సభలోనే సీఎంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌కు, అతని కుటుంబసభ్యులకు, టీఆర్ఎస్ సాగర్‌ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ బహిరంగ సభకు కేసీఆర్‌తో పాటు వీరంతా హాజరయ్యారు. సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉండడంతోనే వ్యాపించినట్లుగా చెబుతున్నారు.

సాగర్‌లో ఉపఎన్నికల ప్రచారంలో తిరిగిన కాంగ్రెస్, బీజేపీ నేతలు అనేకమందికి కూడా కరోనా వచ్చినట్లుగా నివేదికలు చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కరోనా తీవ్రంగా విజృంభించింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుమికూడడం, ప్రజలను కలవడం.. కరోనా నిబంధనలు పాటించకపోవడం కరోనా విస్తరణకు కారణం అయ్యింది.