నిన్న సుమేధ, నేడు నవీన్.. వరద నీరు మింగేసింది.. సరూర్ నగర్ చెరువులో మృతదేహం లభ్యం

  • Published By: naveen ,Published On : September 21, 2020 / 04:11 PM IST
నిన్న సుమేధ, నేడు నవీన్.. వరద నీరు మింగేసింది.. సరూర్ నగర్ చెరువులో మృతదేహం లభ్యం

నవీన్ బాబు గల్లంతు ఎసిసోడ్ విషాదంగా ముగిసింది. వరద నీటిలో కొట్టుకుపోయిన నవీన్ బాబు సరూర్ నగర్ చెరువులో శవమై తేలాడు. 12 గంటల సెర్చ్ ఆపరేషన్ తర్వాత చెరువలో నవీన్ బాబు మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నవీన్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

ఆదివారం(సెప్టెంబర్ 20,2020) తపోవన్ కాలనీలో సాయంత్రం 6.30 గంటలకు నవీన్ బాబు వరద నీటిలో గల్లంతయ్యారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. నవీన్ బాబు ఆచూకీ కోసం తీవ్రంగా గాలించాయి. అయినా ఫలితం లేకపోయింది. నవీన్ బాబు విగతజీవిగా కనిపించాడు. గల్లంతైన ప్రాంతానికి 30 మీటర్ల దూరంలో మృతదేహం కనిపించింది.

బాలాపూర్ మండలం అల్మాస్ గూడకు చెందిన నవీన్ బాబు ఎలక్ట్రీషియన్. నిన్న సాయంత్రం నడుచుకుంటూ వెళ్తుండగా, వరద నీటిలో పడిపోయారు. అక్కడున్న వాళ్లు అందరూ చూస్తుండగానే, వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పాట్ కి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు. తెల్లవారుజామున 3 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. చీకటి పడటం, వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గాలింపు చర్యలను నిలిపివేశారు.

ఇవాళ(సెప్టెంబర్ 21,2020) ఉదయం నుంచి గాలింపు చర్యలను తిరిగి ముమ్మరం చేశారు. అయితే చెరువులో 7 ఫీట్ల మేర బుదర కూరుకుపోవడంతో పాటు చెత్తాచెదారం ఎక్కువ స్థాయిలో ఉంది. దీంతో గాలింపు చర్యలకు ఆటంకం కలిగింది. ఇదే సమయంలో పలు కాలనీల నుంచి వరద ప్రవాహం చెరువులోకి పోటెత్తింది. దీంతో సెర్చ్ ఆపరేషన్ కష్టమని భావించారు. మరోవైపు పడవలను పక్కన పెట్టి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్వయంగా నీటిలోకి దిగి సెర్చ్ చేశారు. దాదాపు 12 గంటల తర్వాత నవీన్ మృతదేహం దొరికింది.

హైదరాబాద్ లో వరద నీటికి బలైన రెండో వ్యక్తి నవీన్. రెండు రోజుల క్రితమే చిన్నారి సుమేధ వరద నీటికి బలైంది. మల్కాజ్ గిరిలో సరదాగా ఆడుకోవడానికి సైకిల్ పై బయటకు వచ్చిన సుమేధను నాలా బలి తీసుకుంది. నాలాలో పడిన సుమేధ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదం మరువక ముందే నవీన్ బాబు వరద నీటికి బలయ్యాడు. రోజుల వ్యవధిలో చోటు చేసుకున్న ఈ రెండు ఘటనలు నగరవాసులను ఆవేదనకు గురి చేశాయి. వర్షం పడే సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది.