Corona Difficulties : కరోనా కష్టకాలంలో అడ్రస్ లేకుండా పోయిన నేతలు

కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక్క నేత కూడా కనిపించడం లేదు. గత ఏడాది రోడ్లపై, ప్రజల్లో ఉన్న నేతలు... ఇప్పుడంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది నేతలంతా విస్తృతంగా పని చేశారు.

Corona Difficulties : కరోనా కష్టకాలంలో అడ్రస్ లేకుండా పోయిన నేతలు

Political Leaders Who Went Unaddressed During Corona Difficult Times

Corona difficult times : కరోనా కంగారెత్తిస్తోంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దానికి తగ్గట్లే మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఆక్సిజన్ కొరత.. ఇంకోవైపు ఆసుపత్రుల్లో సరిపడా బెడ్లు లేక అవస్థ.. మరోవైపు.. బ్లాక్‍‌మార్కెట్‌లో మందులు కొనుక్కోలేని దీనావస్థ.. ఇలాంటి పరిస్థితుల్లో జనం సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఫస్ట్‌ వేవ్‌లో కంటే సెకండ్ వేవ్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. వైరస్ ఎప్పుడు సోకిందో కూడా అర్థం కాకుండానే ప్రాణం మీదకు వస్తుండటంతో.. ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది.

రోజు రోజుకు పరిస్థితి దిగజారుతున్నా.. మేమున్నాం అంటూ భరోసా ఇచ్చే నాథుడే కనిపించకుండా పోయాడు. గత ఏడాది కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించారు. ఇలాంటి పరిస్థితుల్లో పేదలకు అండగా ఉండేందుకు మేమున్నామంటూ చాలా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. అలాగే.. ప్రజాప్రతినిధులు కూడా తమ తమ నియోజకవర్గాల పరిధిల్లో ప్రజలకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. రోగులకు వైద్యం అందించడం నుంచి కాలనీల్లో శానిటైజేషన్ వరకు.. బాధితులకు మందులు, మాస్కులు అందించడం నుంచి.. కావాల్సిన నిత్యావసరాల వరకు నేతలు ఆదుకున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి… ఆహారం, మంచినీరు, మందులు అందించే ప్రయత్నం చేశారు. కాలనీల్లో తిరుగుతూ పనులను పర్యవేక్షించారు.

కానీ.. సెకండ్ వేవ్ విస్తరిస్తున్న సమయంలో ఇప్పుడు ఒక్క నేత కూడా కనిపించడం లేదు. గత ఏడాది రోడ్లపై, ప్రజల్లో ఉన్న నేతలు… ఇప్పుడంతా ఇళ్లకే పరిమితమయ్యారు. గత ఏడాది నేతలంతా విస్తృతంగా పని చేశారు. సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మాత్రం ఎక్కడో ఒక చోట ఒకరిద్దరు ప్రజా ప్రతినిధులు మినహా… 99 శాతం మంది నేతలు అసలు నియోజకవర్గం పరిధిలోకి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. లీడర్లను కూడా కరోనా పలకరిస్తుండటంతో.. మనకెందుకులే రిస్క్ అనుకుంటున్నారేమో కనీసం తాము ఉంటున్న పరిధిలోని ప్రజలకు కూడా అందుబాటులో ఉండటం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఓ రేంజ్‌లో విజృంభిస్తోంది. ఏపీలో ఏకంగా 14 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కూడా 10వేలకు దగ్గర్లో కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతా ఇళ్లల్లోనే ఉండండి.. అవసరమైతే తప్ప బయటకు రాకండి అని స్టేట్‌మెంట్ ఇస్తున్న నేతలు… క్షేత్ర స్థాయిలో ఇబ్బందులపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. బాధితులు ఎవరైనా సాయం కోసం ఫోన్ చేసినా… అనుచరులకు పురమాయించడమో.. లేక ఫోన్‌లోనే మాటివ్వడమో చేస్తున్నారు తప్ప జనంలోకి వెళ్లేందుకు మొహం చాటేస్తున్నారు.

గత ఏడాది రోగులకు వైద్యం అందించడంలో, వైద్య సౌకర్యాలు కల్పించడంలో కొంతమంది నేతలు అండగా ఉన్నారు. కానీ ఈసారి మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కరోనా సోకిన వారిలో ఎక్కువ శాతం మంది ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. అక్కడ బెడ్లు, ఆక్సిజన్ కోసం నేతలను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు సరిగా లేక ఇబ్బంది పడుతున్నా.. లీడర్లు అంతగా స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫస్ట్ వేవ్ సమయంలో అధికారులకు సూచనలు ఇచ్చిన నేతలు.. ప్రజల ఆరోగ్యం, అవసరాల పట్ల శ్రద్ధ చూపించారు. కానీ.. ఈ సారి మాత్రం అసలు కాలనీల్లో శానిటైజేషన్ జరుగుతోందా లేదా అని కూడా పట్టించుకోవడం లేదు. పనులు ఎలా జరుగుతున్నాయో పట్టించుకోవడం లేదు. అంతెందుకు… ఆసుపత్రుల్లో ఆక్సిజన్ లేదు, మందులు లేదని పేషెంట్లు గగ్గోలు పెడుతున్నా డోంట్ కేర్ అన్నట్లుగానే నేతలుంటున్నారు.