Quthbullapur Constituency: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది?

వచ్చే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా ఉండబోతుందన్న విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా.. ఇక్కడి రాజకీయాలు.. కుల సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయ్.

Quthbullapur Constituency: కుత్బుల్లాపూర్ సెగ్మెంట్లో రాజకీయం ఎలా ఉంది?

Quthbullapur Constituency: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం కుత్బుల్లాపూర్. ఫార్మా కంపెనీలకు నిలయయే కాదు.. కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న ప్రాంతం కూడా. రియల్ ఎస్టేట్వ్యాపారానికి కేరాఫ్గా మారిన నియోజకవర్గం కుత్బుల్లాపూర్. అలాంటి సెగ్మెంట్లో.. రాజకీయం ఎలా ఉంది? అధికార బీఆర్ఎస్లో రాజకీయ ఎత్తులతో.. కత్తులు దూస్తున్న నేతలెవరు? చేయి గుర్తు పార్టీలో.. రాబోయే ఎన్నికల్లో పైచేయి ఎవరిది? కమలదళం నుంచి అదృష్టం ఎవరి దక్కుతుంది? ఓవరాల్గా.. ఈసారి కుత్బుల్లాపూర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు.. రేసులో ఉన్న రేసుగుర్రాలు ఎవరు?

తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కుత్బుల్లాపూర్ ఒకటి. ఈ నియోజకవర్గంలో మొత్తం 5 లక్షల 90 వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు. వీరిలో.. 3 లక్షల 10 వేల మంది పురుషులు, 2 లక్షల 79 వేల మందికి పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. దేశంలోనే.. అతిపెద్ద పారిశ్రామిక వాడలున్న నియోజకవర్గంగా.. కుత్బుల్లాపూర్కు ప్రత్యేకత ఉంది. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, గాజులరామారం లాంటి ప్రాంతాల్లో.. నిత్యం రెండు లక్షల మంది కార్మికులు.. వివిధ కంపెనీల్లో పనిచేస్తుంటారు. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. 1250కి పైగా మేజర్ కంపెనీలున్నాయి. అదే స్థాయిలో.. గాలి, నీటి కాలుష్యం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా.. ఫార్మా కంపెనీలకు సంబంధించిన గోదాములు ఇక్కడ ఎక్కువే ఉన్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ముంపు ప్రాంతాలే ఎక్కువే ఉన్నాయి. జీడిమెట్ల, నిజాంపేట, సుభాష్ నగర్ లాంటి ఏరియాలు.. ప్రతి వర్షాకాలం సీజన్లో వరద సమస్యను ఎదుర్కొంటున్నాయ్.

KP Vivekanand GoudKuna Srisailam Goud Narsareddy Bhupathi Reddy

KP Vivekanand Goud, Kuna Srisailam Goud, Narsareddy Bhupathi Reddy

గౌడ సామాజికవర్గం ఓట్లే కీలకం
ఈ నియోజకవర్గంలో మంచి-చెడులను పక్కనబెడితే.. వచ్చే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా ఉండబోతుందన్న విషయం అర్థమవుతోంది. ముఖ్యంగా.. ఇక్కడి రాజకీయాలు.. కుల సమీకరణాల చుట్టూ తిరుగుతున్నాయ్. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో.. రెడ్డి, గౌడ, ముదిరాజ్, మున్నూరు కాపు సామాజికవర్గాల డామినేషన్ ఎక్కువ. ప్రధానంగా.. గౌడ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థులే.. గత మూడు ఎన్నికల్లోనూ వరుసగా గెలుస్తూ వచ్చారు. అధికార బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానంద గౌడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనకంటే ముందు ఎమ్మెల్యేగా గెలిచిన కూన శ్రీశైలం కూడా గౌడ సామాజికవర్గానికి చెందినవారే. అందువల్ల.. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓట్లే కీలకం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా పోటీలో ఉండనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఆశావహుల లిస్ట్ కూడా భారీగానే ఉంది. దీంతో.. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు, ముగ్గురు నేతలు.. పొలిటికల్ గ్రౌండ్లోకి దిగిపోయారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టడంతో.. కుత్బుల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నియోజకవర్గం పరిధిలోని జీహెచ్ఎంసీ డివిజన్లలో.. 7 స్థానాల్లో బీఆర్ఎస్ గెలవగా, ఒకటి బీజేపీ గెలిచింది. రాబోయే ఎన్నికల్లో.. ఈ కార్పొరేటర్లు కూడా కీలకం కానున్నారు. ఇక.. నియోజకవర్గంలో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 10 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. ఇప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీనిపైనా.. ప్రజల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది.

KP Vivekanand Goud

KP Vivekanand Goud (Pic: FB)

వివేకానంద హ్యాట్రిక్ కొడతారా?
ఇప్పటికే.. ఒకసారి టీడీపీ నుంచి మరోసారి బీఆర్ఎస్ నుంచి గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్.. వరుసగా మూడోసారి గెలిచి.. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. అందుకు తగ్గట్లుగా.. ఇప్పటినుంచే వ్యూహాలు రచిస్తున్నారు. జనంలో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయితే.. సొంత పార్టీ కార్పొరేటర్లు కొందరు వివేకానందకు వ్యతిరేకంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు.. మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కూడా.. ఈసారి కుత్బుల్లాపూర్ బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు.. నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే.. కొందరు కార్పొరేటర్లు.. శంభీపూర్ రాజుకు మద్దతిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

Shambipur Raju

Shambipur Raju (Pic: FB)

శంభీపూర్ రాజు సైతం..
నిన్న మొన్నటి వరకు కుత్బుల్లాపూర్ లో కలిసి చక్రం తిప్పిన ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. ఇప్పుడు ఎవరికి వారే పవర్ సెంటర్లుగా మారిపోయారు. దీంతో అధికారులు కూడా ఎవరి మాట వినాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు.. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉండటం కూడా లోకల్ రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మార్చింది. ఎమ్మెల్యే కేపీ వివేకానంద వ్యతిరేక వర్గాన్ని.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు చేరదీస్తుంటే.. ఈయన వ్యతిరేక వర్గాన్ని ఎమ్మెల్యే వివేకానంద చేరదీస్తున్నారట. మొత్తానికి.. వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీ తరపున కుత్బుల్లాపూర్ టికెట్ దక్కించుకునేందుకు.. ఇద్దరు నేతలు ఎవరి స్థాయిలో వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరి మధ్యలో దూరి జిల్లాకే చెందిన మంత్రి మల్లారెడ్డి కూడా తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకునేందుకు.. తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్.. బీఆర్ఎస్లో మరింత హీట్ పెంచుతోంది.

Narsareddy Bhupathi Reddy

Narsareddy Bhupathi Reddy (Pic: @NBRcongress)

కాంగ్రెస్ టికెట్ రేసులో ముగ్గురు
ఇక.. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.. కాంగ్రెస్ని వీడి బీజేపీలో చేరడంతో.. కుత్బుల్లాపూర్లో హస్తం పార్టీ కొంత బలహీనపడింది. అయినప్పటికీ.. ముగ్గురు నేతలు కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుపుతున్నారు. ఈ పోటీ చూశాక.. లోకల్లో కాంగ్రెస్ బలంగానే ఉందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా.. రేవంత్ ప్రధాన అనుచరుడు నర్సారెడ్డి భూపతిరెడ్డి.. ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. నియోజకవర్గాన్ని చుట్టేస్తూ.. క్యాడర్తో టచ్లో ఉంటున్నారు. టికెట్ తనకే కన్ఫామ్ అనే ధీమాతో.. భూపతిరెడ్డి కుత్బుల్లాపూర్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరోవైపు.. కొలన్ హన్మంత్ రెడ్డి, కౌన్సిలర్ జోత్స్న శివారెడ్డి సైతం.. హస్తం పార్టీ నుంచి టికెట్ దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముగ్గురు నేతల మధ్య ఐక్యత లేకపోవడంతో.. క్యాడర్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఎవరివెంట నడవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. ఇదే.. నియోజకవర్గంలో కాంగ్రెస్ని బలహీనపరుస్తోందనే టాక్ హస్తం శ్రేణుల్లో వినిపిస్తోంది. కుత్బుల్లాపూర్పరిధిలో ఉన్న ముస్లింలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన ఓటర్లని నమ్ముకొనే.. కాంగ్రెస్ నేతలు ఎన్నికల బరిలో దిగేందుకు ఇంతలా ఆసక్తి చూపిస్తున్నారు.

Also Read: కారు స్పీడ్‌కు బ్రేకులు పడేనా.. గులాబీ కోటలో కొత్త జెండా ఎగురుతుందా?

Kuna Srisailam Goud (Pic: FB)

బీజేపీ టిక్కెట్ ఆయనకేనా?
మరోవైపు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో.. బీజేపీ బలపడుతోందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ని వీడి కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరడంతో.. ఈ సెగ్మెంట్లో కమలదళం బలం పెరిగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచి.. బీఆర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చింది. ఇక.. కూన శ్రీశైలం గౌడ్ కూడా ఈసారి బీజేపీ నుంచి తనకు టికెట్ గ్యారంటీ అని చెప్పుకుంటున్నారు. మరోవైపు.. అదే పార్టీ నుంచి రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, యువ నాయకుడు భరతసింహారెడ్డి.. టికెట్ రేసులో ఉన్నారు. వీళ్లిద్దరూ పోటీలో ఉన్నా.. అది నామమాత్రమేనని.. కూన శ్రీశైలం గౌడ్కు టికెట్ కన్ఫామ్ అయిపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. అధికార బీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదాలు.. తమకు కలిసొస్తాయని.. బీజేపీ నాయకులు బలంగా నమ్ముతున్నారు.

Also Read: ఖైరతాబాద్ ఈసారి ఎగరబోయే జెండా ఎవరిది.. ట్రయాంగిల్ ఫైట్‌లో తడాఖా చూపేదెవరు?

Kasani Gnaneshwar Mudhiraj

Kasani Gnaneshwar Mudhiraj (Pic: FB)

టీడీపీ అభ్యర్థిగా కాసాని
తెలంగాణ ఏర్పడిన తర్వాత నెమ్మదిగా కనుమరుగవుతూ వచ్చిన తెలుగుదేశం.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి.. మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో మెరవాలని చూస్తోంది. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్.. ఈసారి కుత్బుల్లాపూర్ నుంచే బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ నేత అయిన కాసాని.. తనకు బీసీ సామాజికవర్గాల నుంచి కావాల్సినంత మద్దతు ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ.. జ్ఞానేశ్వర్ గనక కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేస్తే.. టీడీపీ కూడా మిగతా పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలుంటాయని చెబుతున్నారు. దాంతో.. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ.. కుత్బుల్లాపూర్ పాగా వేసేందుకు.. ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. కానీ.. ఇక్కడి ప్రజలు మాత్రం తమ సమస్యలు పరిష్కరించే వారినే గెలిపిస్తామని చెబుతున్నారు. దాంతో.. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపించబోతుందన్నది ఆసక్తిగా మారింది.