Sai Chand Passed Away: సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువదు.. ప్రముఖుల ఘన నివాళి

సాయిచంద్ మృతి పట్ల మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, ఇతర పార్టీల నేతలు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Sai Chand Passed Away: సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువదు.. ప్రముఖుల ఘన నివాళి

Sai Chand Passed Away

TSWC Chairman Sai Chand: ప్రముఖ జానపద గాయకుడు, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ (TSWC Chairman) సాయిచంద్(39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన భౌతికకాయాన్ని రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలో ఉన్న స్వగృహానికి తరలించారు. గురువారం మధ్యాహ్నం సాయిచంద్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం గుర్రం‌గూడ నుంచి సాయిచంద్ అంతిమయాత్ర కొనసాగుతుంది. ఇదిలాఉంటే గుర్రంగూడలోని సాయిచంద్ పార్థివదేహానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చి నివాళులర్పిస్తున్నారు.

సాయిచంద్ మరణం తీరని లోటు : మంత్రి కేటీఆర్

సాయిచంద్ మరణం తీరనిలోటు. అతను అద్భుతమైన కళాకారుడు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేశారని మంత్రి కేటీఆర్ అన్నారు. గుర్రంగూడలోని సాయిచంద్ నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. సాయిచంద్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం : మంత్రి హరీష్ రావు

నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షలాది మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని ప్రజలకు పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయింది. తెలంగాణ ఉద్యమ గాయకుడు, నాకు అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరం. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారు. జోహార్ సాయిచంద్.

సాయిచంద్ నాకు అత్యంత ఆత్మీయుడు : బాల్క సుమన్

లక్షలాది మందిని తన పాటతో ఉర్రూతలూగించిన సాయి‌చంద్ లేరనే మాట జీర్ణించుకోలేక పోతున్నా. సాయి నాకు అత్యంత ఆత్మీయుడు. అజాత శత్రువు సాయి చంద్. మధ్యాహ్నం తర్వాత సాహెబ్‌నగర్‌లో తన అంత్యక్రియలు జరుగుతాయి. ఇంకా తన ఊరు నుంచి చాలా మంది వస్తున్నారు. మధ్యాహ్నం 1గంట వరకు అందరూ వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.

సోదరుడు సాయిచంద్ మృతి నన్ను ఎంతో కలచివేసింది : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ఉద్యమంలో తన ఆట, పాటలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన కళాకారుడు, రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సోదరుడు సాయిచంద్ అకాల మరణం నన్ను ఎంతో కలచివేసింది. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.

సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు – రేవంత్ రెడ్డి

ప్రముఖ గాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా. సాయిచంద్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.

సాయిచంద్‌ను తెలంగాణ సమాజం మరువదు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ ఉద్యమ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ ఆకస్మిక మరణం విచారకరం. చిన్న వయసులోనే సాయిచంద్ మరణం నన్ను తీవ్రంగా కలచివేసింది. తెలంగాణ సమాజం ఒకగొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయింది. ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రంకోసం నేను నల్గొండలో నిరాహార దీక్ష చేసినన్ని రోజులు పాటలు పాడుతూ నావెంటే ఉన్నారు సాయిచంద్. రాష్ట్ర సాధనకోసం సాగిన ఉద్యమంలో ఆయన పాత్ర మరువలేనిది. ఎప్పటికీ జనం గుండెల్లో ఉంటుంది. తన ఆటపాటలతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని సాయిచంద్ రగిలించారు. సాంస్కృతిక రంగంలో పాట ఉన్నన్ని రోజులు సాయిచంద్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుంది. తెలంగాణ ఉద్యమానికి ఆయన స్వరం ఆయువుపట్టుగా నిలిచింది. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను.

సాయిచంద్ మృతి బాధాకరం : ఈటల రాజేందర్

సింగర్, తెలంగాణ గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సాయిచంద్ మరణం మా పార్టీకి తీరని లోటు : మంత్రి కమలాకర్

సాయిచంద్ మృతిపట్ల మంత్రి గంగుల కమలాకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయి చంద్ మరణం మా పార్టీకి తీరని లోటని అన్నారు. మా ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.

కంటతడి పెట్టిన మంత్రి ప్రశాంత్ రెడ్డి..

సాయి చంద్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మంత్రి పశాంతి రెడ్డి కంటతడి పెట్టారు. తమ్ముడు సాయిచంద్ లేడని ఊహించుకుంటేనే బాధగా ఉంది. చిన్న వయసులో చనిపోవడం దురదృష్టకరం. నిజాయితీ గల సైనికుడు సాయిచంద్. తన పాట ఖండాంతరాలు దాటాయి. నా మనుసుకు దగ్గర వ్యక్తి. చాలాసార్లు మా ఇంటికి వచ్చాడు. సీఎం కేసీఆర్ కూడా తనను ఇంకా ఎక్కువ గౌరవించుకోవాలి అన్నారు. సాయిని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది : మంత్రి పువ్వాడ

తెలంగాణ ఉద్యమకారులు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ అకాల మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తెలంగాణ ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. తెలంగాణ ఉద్యమంలో తనపాటతో ప్రజల్లో చైతన్యాన్ని నింపుతూ కీలక భూమిక పోషించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.

సాయిచంద్ మృతి నన్ను ఎంతగానో బాధను కలిగించింది : ఎంపీ నామ

బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు సాయిచంద్ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ ప్రముఖ గాయకులు, తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కీలక పాత్ర పోషించారు. సాయిచంద్‌తో నాకు ఎంతో అనుబంధం, ఆత్మీయ బంధం ఉంది. కళామతల్లి ఓ గొప్ప కళాకారుడిని కోల్పోయింది. సాయిచంద్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని నామా అన్నారు.

సాయిచంద్ మృతి తీరనిలోటు : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

సాయిచంద్ మరణం వార్త నమ్మలేకపోతున్నాను. తెలంగాణ ఒక గొప్ప గొంతుకను కోల్పోయింది. సాయిచంద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.