Ysrcp Mlcs: టీడీపీలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు.. అక్కడ ఇబ్బందులు పడలేకే బయటకు వచ్చేశామని వెల్లడి..
రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మండిపడ్డారు.

Ysrcp Mlcs: ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీలో చేరారు. సీఎం చంద్రబాబు సమక్షంలో బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే ఈ ముగ్గురు వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది.
వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. తాము 6 నెలల క్రితమే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేసినప్పటికీ.. వాటిని ఇప్పటివరకు ఆమోదించలేదని వారు తెలిపారు. తమ రాజీనామా ఆమోదిస్తారన్న నమ్మకం లేదని, అందుకే తాము టీడీపీలో చేరామని బల్లి కల్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ చెప్పారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో భాగస్వాములు కావాలని టీడీపీలో చేరామని వారు వెల్లడించారు.
ఆ బతుకు వద్దనుకున్నాం..
వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే తెలుగుదేశంలో చేరానని మర్రి రాజశేఖర్ తెలిపారు. ఎమ్మెల్సీగా రాజీనామా చేసి 6 నెలలైనా ఇంతవరకు ఛైర్మన్ ఆమోదించలేదన్నారు. ఛైర్మన్ ను వెనక నుండి నడిపిస్తున్న వారి వల్లే మా రాజీనామాలు ఆమోదించలేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే టీడీపీలో చేరామన్నారు. రాజీనామాలు ఆమోదించ లేదు కాబట్టి తెలుగుదేశం కండువాలతో సోమవారం నుంచి సభకు వెళ్తామన్నారు. వైసీపీలో కూలీలుగా బతికే బతుకు వద్దనుకున్నామని హాట్ కామెంట్స్ చేశారు మర్రి రాజశేఖర్.
ఇబ్బందులు భరించలేకే బయటకు..
నేను రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ చక్రవర్తి మండిపడ్డారు. టీడీపీలో చేరటం సొంత గూటికి వచ్చినట్లు ఉందన్నారు. వైసీపీ పెట్టే ఇబ్బందులు భరించలేక బయటకు వచ్చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిలో కలిసి నడవాలని టీడీపీలో చేరామన్నారు.
వైసీపీలో ఎదుగుదల లేదు..
ఏడాది నుంచి నా రాజీనామా ఆమోదించకుండా మండలి ఛైర్మన్ కాలయాపన చేశారని కర్రి పద్మశ్రీ వాపోయారు. ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన నాకు వైసీపీలో ఎలాంటి ఎదుగుదుల, అవకాశాలు లేవని వ్యాఖ్యానించారు.
Also Read: కడప సైకిల్ రథసారధి అయ్యేదెవరు? ఆ ఇద్దరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?