ఏసీబీకీ చిక్కిన సీఐ : ఆస్తుల విలువ రూ.4.62 కోట్లు

ఏసీబీకీ చిక్కిన సీఐ : ఆస్తుల విలువ రూ.4.62 కోట్లు

పోలీసు ఉద్యోగంలో చేరి కోట్లు సంపాదించాడు ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్. లంచాల ముసుగులో ఇళ్లు , పోలాలు,బంగారం కూడ బెట్టాడు. చివరికి ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఒక భూ సెటిల్మెంట్ వ్యవహారం లో ఏసీబీకి చిక్కిన షాబాద్ సీఐ శంకరయ్య ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు.

లంచం డిమాండ్‌ చేయడం, డబ్బులు తీసుకుంటూ పట్టుబడడంతో ఇప్పటికే సీఐ శంకరయ్యను, ఏఎస్సై కె రాజేందర్‌లను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేసు దర్యాప్తులో భాగంగా సీఐ ఇంట్లో సోదాలు నిర్వహించగా మొత్తం రూ.17.88 లక్షల నగదు దొరికినట్లు అధికారులు తెలిపారు.

రెండు రోజులుగా హైదరాబాద్‌తోపాటు నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ముల్కపట్నం, సూర్యాపేట జిల్లా మోతె గ్రామాల్లోనూ గత సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇండ్లలోనూ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇండ్లు, ప్లాట్లు, పొలాలు, ఆభరణాలు కలిపి మొత్తం రూ.4.62 కోట్ల ఆస్తులను గుర్తించినట్టు ఏసీబీ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

సోదాల్లో దొరికిన సీఐ ఆస్తుల చిట్టా
రూ.1.05 కోట్ల విలువైన రెండు ఇండ్లు
రూ.2.28 కోట్ల విలువైన 11 ఇండ్ల స్థలాలు
నిజామాబాద్‌ జిల్లా రెంజల్‌, వికారాబాద్‌ జిల్లా చేవెళ్ల మండలం ముడిమ్యాల, నల్లగొండ జిల్లా మిర్యాలగూడల్లో కలిపి రూ.77 లక్షల విలువైన 41 ఎకరాల 3 గుంటల వ్యవసాయ భూములు.
రూ.7 లక్షల విలువ చేసే స్విప్ట్‌ కారు
రూ.21.14 లక్షల విలువైన బంగారు నగలు. రూ.81 వేల విలువైన వెండి ఆభరణాలు. రూ.6.13 లక్షల విలువైన గృహోపకరణాలు పట్టుబడ్డాయి.

అతడి బ్యాంకు లాకర్లను కూడా ఏసీబీ అథికారులు పరిశీలించనున్నారు. గురువారం అదుపులోకి తీసుకున్న సీఐ శంకరయ్య, ఏఎస్సై రాజేందర్ ను నాంపల్లి లోని ఏసీబీ కార్యాలయానికి తరలించి, అక్కడి నుంచి కరోనా పరీక్షల నిమిత్తం కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు.