Saritha : నాలా చాలామంది మహిళలు బీఆర్ఎస్‌లో బాధపడుతున్నారు- కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత
శక్తిపీఠం ఉన్న జోగులాంబ జిల్లాలోనే మహిళకు స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం అని వాపోయారు. ZP Chairperson Saritha

ZP Chairperson Saritha(Photo : Google)
ZP Chairperson Saritha : జోగులాంబ గద్వాల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. జోగులాంబ గద్వాల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ సరిత బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. భర్తతో కలిసి ఆమె కాంగ్రెస్ లో చేరారు. సరితతో పాటు తిరుపతయ్య, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీదేవి మరో 5 గ్రామాల సర్పంచ్ లు, ఇతర నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. టీపీసీసీ నేతలు వారందరికీ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై సరిత మండిపడ్డారు. నన్ను నా పని చేయనివ్వలేదని ఆమె ఆరోపించారు. సొంతంగా పని చేసే వాతావరణం బీఆర్ఎస్ లో లేదన్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. శక్తిపీఠం ఉన్న జోగులాంబ జిల్లాలోనే మహిళకు స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం అని వాపోయారు. నాలా రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, వారంతా బయటకు వస్తారని సరిత అన్నారు.
ప్రశ్నిస్తే ప్రతిపక్షాన్ని మాత్రమే కాదు స్వపక్షాన్ని కూడా అణచివేస్తున్నారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా ఆ పార్టీని వీడి బయటకు వస్తున్నారు. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని చీత్కరిస్తున్నారు అని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ అన్నారు.
ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి, మరికొందరు ప్రజా ప్రతినిధులు, మాజీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అందుకే ఆ పార్టీలో చేరాను. బాల్కొండ నియోజకవర్గంలో మాత్రమే కాదు. జిల్లా, రాష్ట్రం అంతటా పార్టీ కోసం పని చేస్తాను అని ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి అన్నారు.