Tandur Constituency: బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

Tandur Constituency: బీఆర్‌ఎస్‌లో హీట్ పుట్టిస్తున్న తాండూరు పాలిటిక్స్.. కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

Tandur Assembly Constituency Ground Report

Tandur Assembly Constituency: రాష్ట్ర రాజకీయం అంతా ఒక ఎత్తైతే.. తాండూరు రాజకీయం (Tandur Politics) మరో ఎత్తు. ఇక్కడ ఎప్పుడూ హైవోల్టేజ్ రాజకీయమే కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ (BRS Party)లో పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy) ఓడిపోవడం.. ఆయనపై గెలిచిన పైలెట్ రోహిత్‌రెడ్డి (Pilot Rohith Reddy) బీఆర్‌ఎస్‌లో చేరిపోవడంతో… ఈ ఇద్దరి మధ్య నాలుగున్నరేళ్లగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పుడు కూడా ఈ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్ దక్కుతుందోననేది సస్పెన్స్‌గా మారింది. టిక్కెట్ ఎవరికి దక్కినా.. ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి లేదు. పైగా ఒకరిపై ఒకరు పోటీకి సై అంటున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలు.. ఎత్తుకు పైఎత్తులతో రాజకీయం రసకందాయంగా మారిన తాండూరులో ఈ సారి కనిపించే సీనేంటి? కాంగ్రెస్, బీజేపీ ప్లానేంటి?

Patnam Mahender Reddy

పట్నం మహేందర్‌రెడ్డి (photo: facebook)

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గంగా గుర్తింపు పొందింది. 1962 నుంచి కాంగ్రెస్ పార్టీ కంచుకోట‌ ఈ నియోజకవర్గం. 1999లో తొలిసారి గెలిచి తన హవా చాటారు మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి. ఆ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన మహేందర్‌రెడ్డి.. ఆ పార్టీ తరఫున వరుసగా మూడుసార్లు.. 2014 నుంచి బీఆర్‌ఎస్ తరఫున గెలిచి తాండూరు తన అడ్డాగా పిలిపించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో కీలక నేతగా ఎదిగిన మహేందర్‌రెడ్డికి.. 2018లో మాత్రం చేదు ఫలితం తప్పలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు మహేందర్‌రెడ్డి. అనంతర కాలంలో రోహిత్‌రెడ్డి గులాబి శిబిరంలో చేరిపోయారు. పైలెట్ చేరికతో.. మహేందర్‌రెడ్డికి ఇబ్బంది రాకుండా ఆయనకు ఎమ్మెల్సీ చేసింది బీఆర్‌ఎస్ అధిష్టానం. కానీ.. ఈ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదర్చలేకపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో చేరిన నుంచి తాండూరులో గ్రూపు రాజకీయం మొదలైంది.

Also Read: మహేశ్వరం నియోజకవర్గంలో ఈసారి పోటీకి దిగేదెవరు.. త్రిముఖ పోరు తప్పదా?

ఈ ఇద్దరు నేత‌ల ఆధిప‌త్య పోరుపై ఎన్నోసార్లు పంచాయితీ పెట్టింది బీఆర్‌ఎస్ అధిష్టానం. స్థానిక ఎన్నిక‌లు, ఎంపీపీ, మున్సిప‌ల్ చైర్మన్ ఎంపిక సంద‌ర్భంగా ఇద్దరి మధ్య సమన్వయం చేసేందుకు మ‌రో ఇన్‌చార్జ్ నేత‌ను నియమించింది హైకమాండ్. కానీ, అధిష్టానం చర్యలు ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరించినా.. విభేదాలకు ఫుల్‌స్టాప్ మాత్రం పడటంలేదు. ఎన్నికల ఏడాది కావడంతో ఈ మధ్య ఈ ఇద్దరి నేతల మధ్య గ్యాప్ మరింతగా పెరిగిపోయింది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా పైలెట్ రోహిత్‌రెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఇటీవల కాలంలో అధిష్టానంతో మంచి సంబంధాలు ఉండటంతో టిక్కెట్ తనదేననే ధీమాగా ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల వ్యూహరచనతో ముందుకు వెళుతున్నారు ఎమ్మెల్యే. అయితే ఈ పరిణామాలు రుచించని ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఎమ్మెల్సీగా పదవీకాలం ఉన్నా తాండూరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ బ‌హిరంగం ప్రక‌ట‌న‌లు చేస్తున్నారు. గ‌త ఐదేళ్లలో అభివృద్ధి, యువ‌ మంత్రంతో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ట్టు బిగించే య‌త్నం చేస్తున్నారు. మాజీ మంత్రి వ్యూహాల‌కు చెక్ పెడుతూ.. మాజీ మంత్రి అనుచ‌రుల‌ను సైతం చేర‌దీస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రింత ప‌ట్టు సాధించే య‌త్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా త‌న‌కే పార్టీ అవ‌కాశం కల్పిస్తుంద‌ని రోహిత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Pilot Rohith Reddy

పైలెట్ రోహిత్‌రెడ్డి (photo: facebook)

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి టిక్కెట్‌పై ధీమాగా ఉండగా.. మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి మాత్రం ఎలాగైనా టిక్కెట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. నాలుగైదు నియోజవర్గాలపై మహేందర్‌రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉండడంతో గులాబీ పార్టీ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనలేక.. ఎమ్మెల్సీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేక.. ఈ గ్రూప్ వార్‌కు ఎలా పుల్‌స్టాప్‌ పెట్టాలోనని అంతర్మథనం చెందుతోంది బీఆర్‌ఎస్ అధిష్టానం. అయితే మహేందర్‌రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కొడంగల్ టిక్కెట్ ఇస్తామనే సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు మహేందర్‌రెడ్డి ససేమిరా అంటున్నారు. తనకు తాండూరు టిక్కెట్ మాత్రమే కావాలని పట్టుబడుతున్నారు. పార్టీ టికెట్ ఇవ్వక‌పోతే మ‌రోదారి చూసుకోవాల్సి వ‌స్తుంద‌న్న సంకేతాల‌ను పంపుతున్నారు మహేందర్‌రెడ్డి.

Ramesh ManikRao Maharaj

Malkud Ramesh (photo: facebook)

ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రి మంత్రి మహేందర్‌రెడ్డి మధ్య తీవ్ర పోటీ ఉండటంతో తాండూరు రాజకీయం ఉత్కంఠగా మారింది. ఈ ఇద్దరు ఈ సారి పోటీకి రెడీ అవుతుండటం.. అవసరమైతే ప్రత్యామ్నాయాలు చూసుకుంటానని మహేందర్‌రెడ్డి హెచ్చరిస్తుండటంతో బీఆర్‌ఎస్ చుట్టూ రాజకీయం కేంద్రీకృతమైంది. బీఆర్‌ఎస్ టిక్కెట్ పంచాయితీ తేలిన తర్వాతే.. కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులపైనా ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు. మహేందర్‌రెడ్డి హవా తర్వాత తాండూరులో కనుమరుగైన కాంగ్రెస్.. 2018లో కోలుకున్నా.. ఎమ్మెల్యే పార్టీ మారటంతో కోలుకోలేని స్థితికి చేరుకుంది కాంగ్రెస్.. అయితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ద‌శాబ్దాలుగా అండగా ఉన్న చంద్రశేఖర్ కుటుంబ స‌భ్యులకే ఈ ఎన్నిక‌ల్లో కూడా టికెట్ ద‌క్కే అవ‌కాశం కనిపిస్తోంది. చంద్రశేఖర్ త‌న‌యుడు ర‌మేష్ (Malkud Ramesh) కాంగ్రెస్ టికెట్ రేసులో ముందు వ‌రుస‌లో ఉన్నారు. 2018 ఎన్నికల సమయంలో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో పోటీ నుంచి తప్పుకున్న రమేశ్.. పైలెట్ రోహిత్‌రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు రోహిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో ఉండటంతో ప్రస్తుతానికి రమేశ్‌కే కాంగ్రెస్ టిక్కెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ, కొత్తగా ఎవరైనా చేరితే.. రమేశ్ ప్లేస్‌లో కొత్త నేత పోటీలోకి రావొచ్చనని అంటున్నారు పరిశీలకులు.

MuraliKrishna Goud Gajipur

MuraliKrishna Goud Gajipur (photo: facebook)

ఇక బీజేపీ కూడా తాండూరుపై ఆశలు పెట్టుకుంటోంది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు ఉన్న మాజీ జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మన్ ముర‌ళీ గౌడ్ (MuraliKrishna Goud Gajipur) బీజేపీ తరఫున పోటీ చేసి.. గురువుకే సవాల్ విసరాలని అనుకుంటున్నారు. మురళీగౌడ్‌కు పోటీగా స్థానిక నేత రమేశ్ సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రవిశంకర్ ఈ సారి తన భార్యకు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ప్రధాన పార్టీలకు దీటుగా తాండూరు బీజేపీలో ముగ్గురు నేతలు పోటీకి సై అంటుండటం ఆసక్తికరంగా మారింది.

Also Read: బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు ఎత్తులకు పై ఎత్తులు.. టికెట్ రేసులో ఉన్న నేతలెవరు?

ఎన్నికలు సమీపిస్తుండటంతో తాండూరు రాజకీయం పతాకస్థాయికి చేరుతోంది. మాజీ మంత్రి మ‌హేంద‌ర్రెడ్డి చుట్టే రాజకీయం తిరుగుతోంది. బిఆర్ఎస్‌లో ఆయనకు మొండిచేయి ఎదురైతే.. తమ పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ప్రత్యామ్నాయాలపై మహేందర్‌రెడ్డి కూడా ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా రోహిత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి మధ్యే మళ్లీ పోటీ జరిగే చాన్స్ కనిపిస్తోంది.

Also Read: సంగారెడ్డిలో జగ్గారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది.. బీఆర్ఎస్ ఈసారి జెండా ఎగరేస్తుందా?

దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి మ‌ర్రి చెన్నారెడ్డి వంటి దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్‌గా మారింది. తాండూరు మున్సిపాలిటీతో సహా తాండూరు, యాలాల‌, బ‌షీరాబాద్, పెద్దేముల్ మండ‌లాలు ఉన్న ఈ నియోజకవర్గ ఫలితాలను శాసించేది గ్రామీణ ప్రాంతాలే.. నాప‌రాయికి దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరులో వేలాది మంది కార్మికులు స్థిరపడ్డారు. దేశ నలుమూలల నుంచి ఇక్కడకొచ్చి స్థిరపడిన కార్మికులు కూడా నేతల భవిష్యత్‌ను నిర్దేశించనున్నారు.