కూలీలుగా మారిన పంతుళ్లు.. ప్రయివేటు స్కూల్ టీచర్లపై కరోనా దెబ్బ

  • Published By: nagamani ,Published On : May 30, 2020 / 01:21 PM IST
కూలీలుగా మారిన పంతుళ్లు.. ప్రయివేటు స్కూల్ టీచర్లపై కరోనా దెబ్బ

కరోనా కష్టకాలంలో లాక్ డౌన్ దెబ్బకు అన్ని రంగాలతో పాటు..అన్ని ఉత్పత్తి వ్యవస్థలతో పాటు విద్యావ్యవస్థ కూడా ఛిన్నాభిన్నమైపోయింది. రెక్కాడితేనే గానీ డొక్కాని కష్టజీవుల పరిస్థితి అయితే వర్ణనాతీతంగా ఉంది. 

ఈక్రమంలో విద్యాబుద్ధులు చెప్పే టీచర్లు కూడా రోజువారీ పనులకు వెళ్లిల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్షరాలు దిద్దించాల్సిన చేతులు పలుగు పారలు పట్టి కూలికి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు ప్రయివేటు స్కూల్ టీచర్లు. 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 12వేలకు పైగా ప్రయివేటు స్కూల్స్ ఉన్నాయి. దాంట్లో 2 లక్షలకు పైగా టీచర్లు పనిచేస్తున్నారు. ప్రభుత్వ టీచర్లకైతే లాక్ డౌన్ సమయంలో కూడా జీతాలు వచ్చాయి. (సగం జీతాలు) కానీ ప్రయివేటు స్కూల్ టీచర్ల పరిస్థితి అలాకాదు. పనిచేస్తేనే జీతాలు వస్తాయి. పాఠాలు చెబితేనే జీతం పైసలు చేతికొస్తాయి. మూడు నెలల నుంచి స్కూల్ యాజమాన్యలు జీతాలు ఇవ్వక..స్కూల్ గేట్లు ఎప్పుడు తెరుస్తారా? ఎప్పుడు జీతాలు ఇస్తారా? అని ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నుంచి వీరికి జీతాలు రాలేదు.

ఇక్కడ దాగున్న మరో కష్టం ఏమిటంటే..అసలు వారి ఉద్యోగం ఉంటుందా? ఊడుతుందా? అనే ఆందోళనకూడా లేకపోలేదు చాలామంది ప్రయివేటు టీచర్లకు.ఎందుకంటే కరోనా కొనసాగుతున్న క్రమంలో ఇప్పట్లో స్కూల్స్ తెరుచుకునే పరిస్థితి లేదు. పైగా విద్యావిధానాల్లో పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. 100 శాతం విద్యార్ధుల్లో 30 నుంచి 50 శాతం మాత్రం విద్యార్ధులే స్కూల్ కు రావాలి. ఎందుకంటే భౌతిక దూరం తప్పనిసరికాబట్టి.

అలాగే పలు మార్పులు విద్యావిధానంలోచోటుచేసుకోనున్నాయి. దీంతో ప్రయివేటు స్కూల్స్ లో టీచర్ల సంఖ్యపై కూడా ఈ కరోనా దెబ్బ తీవ్రంగా పడనుంది. టీచర్ల సంఖ్య భారీగా తగ్గించేయాలని ఆయా ప్రయివేటు స్కూల్ యాజమాన్యాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే విద్యార్ధుల సంఖ్య తగ్గితే వారి ఆదాయం కూడా తగ్గుతుంది. దీంతో టీచర్ల సంఖ్యకూడా తగ్గిపోనుంది.

దీంతో ప్రయివేటు టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. వారు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పటి వరకూ పనిచేసిన యాజమాన్యాలు తమను ఆదుకోవాలని..అలాగే ప్రభుత్వాలు కూడా తమను ఆదుకోవాలని కోరుతున్నారు తెలంగణ ప్రయివేటు టీచర్ల అసోసియేషన్లు. జీతాలు లేక .. ,కుటుంబాలను పోషించుకోవటానికి రోజువారీ కూలిపనులకు కూడా వెళుతున్నామనీ వాపోతున్నారు ప్రయివేటు స్కూల్స్ లో పనిచేసిన టీచర్లు.