Telangana Covid 19 :తెలంగాణను భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్.. ఒక్కరోజే 500లకు పైగా కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది.

Telangana Covid 19 :తెలంగాణను భయపెడుతున్న కరోనా సెకండ్ వేవ్.. ఒక్కరోజే 500లకు పైగా కొత్త కేసులు

394 Corona Cases Registered In A Single Day Across Telangana 1

Telangana Covid 19 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలు దాటడం భయాందోళనకు గురి చేస్తోంది. నిన్న(మార్చి 25,2021) రాత్రి 8గంటల వరకు 57వేల 548 మందికి కరోనా నిర్థరణ పరీక్షలు చేయగా, కొత్తగా 518 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు.

4వేలకు చేరువలో యాక్టివ్ కేసులు:
ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 1,683కి చేరింది. కరోనా నుంచి మరో 204 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3వేల 995 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 1,767 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 157 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(మార్చి 26,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

గత 8 రోజుల్లోనే రెట్టింపు కేసులు:
రాష్ట్రంలో కొవిడ్‌ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. గత ఎనిమిది రోజుల్లోనే రెట్టింపు కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వైరస్‌ పంజా విసురుతోంది. గత వారం రోజుల వ్యవధిలో నాలుగింతలకు పైగా పాజిటివ్‌లు నమోదవడం గమనార్హం. రాష్ట్రంలో గత ఏడాది(2020) నవంబరు నెలాఖరులో 502 కేసులు నమోదవగా.. మళ్లీ అదే స్థాయిలో శుక్రవారం(మార్చి 26,2021) 518 కొత్త కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

అతి వేగంగా వైరస్ వ్యాప్తి:
ఏడాది కిందట నమోదైన కేసులతో పోల్చితే.. ప్రస్తుతం వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యశాఖ చెబుతోంది. గతేడాది(2020) వైరస్‌లో మార్పులు చెంది కొత్తగా రూపాంతరం చెందిందా? లేదా బ్రిటన్‌, దక్షిణాఫ్రికా రకం వైరస్‌లా? అనేది ప్రస్తుతం నిర్ధారణ కాకపోయినా.. అతి వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందన్నది మాత్రం వాస్తవమని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.

ఆసుపత్రుల్లో పెరుగుతున్న కొవిడ్‌ బాధితుల సంఖ్య:
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌ బాధితుల చేరికలు పెరుగుతున్నాయి. గత వారంరోజుల్లో దాదాపు 70 శాతం పెరగడం తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రస్తుతం కొవిడ్‌ చికిత్సలపై స్పష్టత ఏర్పడడంతో.. బాధితులను త్వరగా గుర్తించి స్థానికంగానే నయం చేయడానికి అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇతరత్రా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, కొవిడ్‌ తీవ్రత అధికంగా ఉన్నవారిని, కచ్చితంగా సూపర్‌ స్పెషాలిటీ సేవలు అవసరమైన వారిని మాత్రమే గాంధీ, ఉస్మానియా తదితర బోధనాసుపత్రులకు తరలించాలని సూచించింది.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం , 700కు పైగా కొత్త కేసులు నమోదు:
తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ప్రమాదకర రీతిలో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదవం గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 95వేల 879కి చేరింది. మరో నలుగురు కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7వేల 201కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 231 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 3వేల 469 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 35వేల 196 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ గురువారం(మార్చి 25,2021) విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కోటి 48లక్షల 75వేల 597 కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

భారీ మూల్యం తప్పదు:
కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నా వైరస్‌ను లైట్ తీసుకోవద్దని అంటున్నారు. అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన భారీ మూల్యం చెల్లించక తప్పదంటున్నారు.

24గంటల్లో 59వేల 118 కేసులు, 257 మరణాలు:
దేశంలో కరోనా సెకండ్‌ వేవ్ ఉగ్రరూపం దాల్చింది. రోజువారీ నమోదవుతున్న కేసులు చూస్తుంటే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా 60వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం, 200కుపైగా మరణాలు చోటు చేసుకోవడం భయాందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 11,00,756 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..59వేల 118 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. రోజూవారీ కేసుల విషయంలో గతేడాది(2020) అక్టోబర్ మధ్యనాటి పరిస్థితి నెలకొని ఉంది. గతేడాది అక్టోబర్ 18న ఒక్కరోజే 55వేల కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 257మంది కరోనాకు బలయ్యారు. మొత్తం కేసులు కోటి 18లక్షల మార్కును దాటగా.. మృతుల సంఖ్య 1,60,949కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం(మార్చి 26,2021) వివరాలు వెల్లడించింది.

4లక్షలు దాటిన యాక్టివ్ కేసులు:
యాక్టివ్ కేసులూ పెరుగుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలు దాటింది. ప్రస్తుతం 4లక్షల 21వేల 066 యాక్టివ్ కేసులుండగా..ఆ రేటు 3.55 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,12,64,637 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..ఆ రేటు 95.09శాతానికి పడిపోయింది. నిన్న(మార్చి 25,2021) ఒక్కరోజే 32,987 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

ఒక్క మహారాష్ట్రలోనే 35వేలకు పైగా కేసులు:
దేశంలో కరోనా విజృంభణలో మహారాష్ట్ర వాటానే అధికంగా ఉంది. ఆ రాష్ట్రంలో తాజాగా 35వేల 952 కొత్త కేసులు వెలుగుచూడగా..111 మంది కరోనాకు బలయ్యారు. అన్ని రాష్ట్రాల్లో కలిపి 4.21లక్షల యాక్టివ్ కేసులుండగా..ఒక్క మహారాష్ట్రలోనే వాటి సంఖ్య 2,64,001గా ఉంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసులు 26లక్షలకు పైబడగా.. 22,83,037 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు.