Waterfalls : తెలంగాణలో జలపాతాల అందాలు

తెలంగాణలో భారీ వర్షాలతో జలపాతాలు హొయలొలికిస్తున్నాయి. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు మురిసిపోతున్నారు.

Waterfalls : తెలంగాణలో జలపాతాల అందాలు

Waterfalls

The beauty of waterfalls : తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలతో చాలా ప్రాంతాలు జలమయం కాగా.. మరోవైపు జలపాతాలు హొయలొలికిస్తున్నాయి. ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ పర్యాటకులు మురిసిపోతున్నారు. తెలంగాణలో సుందరమైన జలపాతాలకు కొదువలేదు. ఏటా వర్షాకాలంలో వాటర్‌ ఫాల్స్‌ కనువిందు చేస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. భారీ వర్షాలకు జలకళను సంతరించుకుని పరవళ్లు తొక్కుతూ కనువిందు చేస్తున్నాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నల్లగొండ, ములుగు, నిర్మల్‌, మహబూబ్‌నగర్‌, పెద్దపల్లి తదితర జిల్లాల్లో వాటర్‌ఫాల్స్‌ పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.

అద్భుతమైన జలపాతాలు అందాలొలికిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు అన్ని వాటర్‌ఫాల్స్‌ హొయలు పోతున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలం చీకులపల్లి అటవీ ప్రాంతంలోని బొగత, కొంగల జలపాతాలకు సందర్శకుల తాకిడి పెరిగింది. బొగత జలపాతం తెలంగాణ నయాగరగా పేరు పొందింది. ఛత్తీస్‌గఢ్‌తో పాటు జిల్లాలో కురిసిన వర్షాలకు జాలువారుతున్న జలధారలు జనానికి కనువిందు చేస్తున్నాయి. వాటి సోయగాలను చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నాయి.

కొండకోనల నుంచి జారిపడుతున్న పాలనురగల్లాంటి జలాలను చూసి మురిసిపోతున్నారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఎత్తు నుంచి జారి పడుతున్న జలాల్లో జలకాలాడుతూ కేరింతలు కొడుతున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో సేదతీరుతూ మదిలో కొత్త అనుభవాలను నింపుకుంటున్నారు.

మరోవైపు బొగత జలపాతాలను చూసేందుకు వస్తున్న సందర్శకులకు చేదు అనుభవం ఎదురవుతోంది. కుండపోత వర్షాలతో నీటి ప్రవాహ ఉధృతికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న ఉద్దేశంలో వాటర్‌ఫాల్స్‌ దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంలేదు. దీంతో దూరంగా చూసి నిరుత్సాహంతో తిరిగి వెళ్లాల్సి వస్తోంది. వర్షాలు తగ్గడంతో సందర్శకులను జలపాతం దగ్గరకు అనుమతి ఇచ్చే అంశం అధికారుల పరిశీలనలో ఉంది. కొంగల జలపాతం దగ్గర ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో పర్యాటకులు అందాలను ఆస్వాదిస్తున్నారు. 70 అడుగుల ఎత్తు నుంచి జారి పడుతున్న జలాలను చూసి మురిసిపోతున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న కొండకోనల్లో సహజమైన జలపాతాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గం రాచకొండగుట్టల్లో పలు జలపాతాలు ఉన్నాయి. వాటిలో బుగ్గ జలపాతం ఒకటి. మర్రిగూడ మండలం అజలాపురం సమీపంలోని ఈ జలపాతం సందర్శకులు మనసు దోచుకుంటోంది. వర్షాకాలంలో 2 నుంచి 3 నెలల పాటు సందడి చేస్తుంది. బుగ్గ జలపాతానికి చేరుకోడానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంపై సందర్శకులు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

బుగ్గ జలపాతానికి రోడ్డు, రవాణా సౌకర్యం కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సూచిస్తున్నారు. పర్యాటకులు కూడా పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తం మీద తెలంగాణలోని జలపాతాలు మరోసారి సందడిగా మారాయి. సౌకర్యాలు మెరుగుపరిస్తే వర్షాకాలంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.