TS Crime : అన్నను హత్య చేయటానికి రూ.1 కోటి సుపారీ ఇచ్చిన వికారాబాద్ రవాణా అధికారి..

వికారాబాద్‌ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్‌ ఆస్తి కోసం సొంత అన్ననే చంపటానికి రూ.కోటి సుపారీ ఇచ్చాడు. కానీ ఈ క్రైమ్ కథా చిత్రంలో చోటు చేసుకున్న ట్విస్టులు అన్నీ ఇన్నీ కావు..

TS Crime : అన్నను హత్య చేయటానికి రూ.1 కోటి సుపారీ ఇచ్చిన వికారాబాద్ రవాణా అధికారి..

Vikarabad Dto Wanted To Kill His Own Brother Deal Supari Rs.1 Crores (1)

TS Crime : వాళ్లిద్దరు అన్నదమ్ములు..ఇద్దరు కలిసి ఆస్తి భారీగా సంపాదించారు. కోట్లకు పడగలు ఎత్తారు.వందల ఎకరాల భూములు,ప్లాట్లు, క్వారీలు ఒకటేంటి బాగా సంపాదించారు.ఆస్తి తెచ్చిన గొడవ కాస్తా ఏకంగా అన్నను చంపటానికి కిరాయి రౌడీలను పురమాయించాడు తమ్ముడు. కానీ బెడిసి కొట్టింది. కానీ మళ్లీ ప్రయత్నించాడు.ఏకంగా కోటి రూపాయలు..ఎకరం పొలం ఇస్తానంటూ సుపారీ మాట్లాడాడు. సూర్యాపేట జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ క్రైమ్ కథా చిత్రంలో ఎన్ని మలుపులు ఉండాలో అన్ని మలుపులు ఉన్నాయి. అచ్చంగా సినిమాలోలాగా. అన్నతో గొడవలు పెంచుకున్న తమ్ముడు అన్నను చంపేస్తే ఆస్తి మొత్తం తనదే అనుకున్నాడు. కానీ అసలు విషయం బయటపడింది.

అన్న హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి వికారాబాద్‌ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్న భద్రునాయక్‌ కావడం గమనించాల్సిన విషయం. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని బసవతారకం కాలనీకి చెందిన బాణోతు వీరునాయక్‌, భద్రునాయక్‌ అన్నదమ్ములు.వీరిద్దరు గ్రానైట్ వ్యాపారం చేస్తారు. తమ్ముడు భద్రునాయక్‌ వికారాబాద్‌ జిల్లా రవాణా అధికారిగా పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి స్వగ్రామంలో 120 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్‌ నగరంలో ప్లాట్లు, ఇళ్లు, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బొప్పారం గ్రామశివారులో 12 ఎకరాల భూమి, రెండెకరాల గ్రానైట్‌ క్వారీ, చింతకాని మండలం తిమ్మినేనిపాలెంలో రెండెకరాల గ్రానైట్‌ క్వారీని పొత్తులో కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నారు. కాగా, బొప్పారం క్వారీలో భద్రునాయక్‌ తన బంధువైన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండాకు చెందిన లునావత్‌ హరీశ్‌ను సూపర్‌వైజర్‌గా నియమించుకున్నాడు.

ఏసీబీకి పట్టిస్తాననడంతో..మొత్తం ఆస్తిలో తనకు సమాన వాటా ఇవ్వాలంటూ కొంతకాలంగా వీరునాయక్‌ తన తమ్ముడు భద్రూనాయక్‌ను కోరుతున్నాడు. కానీ, ఇందుకు భద్రునాయక్‌ అంగీకరించకపోవడంతో ఉద్యోగంలో అక్రమంగా సంపాదించిన విషయాన్ని ఏసీబీకి చెబుతానని బెదిరించాడు. దీంతో అన్నపై తమ్ముడు కక్ష పెంచుకున్నాడు. ఇదే సమయంలో క్వారీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న హరీశ్‌ను వీరునాయక్‌ ఉద్యోగం నుంచి తీసివేశాడు.దీంతో భద్రునాయక్‌.. హరీశ్‌ను సంప్రదించి తన అన్నను చంపితే రూ.కోటి, ఎకరం భూమి ఇస్తానని డీల్ కుదుర్చుకున్నాడు. హరీశ్‌ తన స్నేహితులైన సూర్యాపేటకు చెందిన జక్కి సతీష్‌, గంట పరశురాములు, విజయ్‌భరత్‌, రియాజ్‌, రాజానాయక్‌తండాకు చెందిన సంపంగి ప్రవీణ్‌లకు ఈ విషయం చెప్పి ఒప్పించాడు. అనంతరం జూన్‌ 20న అంతా కలిసి ఖమ్మం వెళ్లారు. అయితే అక్కడ అతని ఆచూకీ తెలుసుకోలేక తిరిగి వచ్చారు. జూన్‌ 30న మరోసారి ఖమ్మం జిల్లాలోని తిరుమలాయిపాలెం మండలంలోని కాకరవాయి, జూపెడ మధ్య వీరునాయక్‌ కారును వేరే కారుతో ఢీకొట్టి, కత్తులతో నరికి చంపే ప్రయత్నం చేశారు. అయితే తన వెంట ముగ్గురు వ్యక్తులు ఉండటంతో ప్రతిఘటించిన వీరునాయక్‌ తప్పించుకున్నాడు.

హత్య కుట్రను సుపారీ గ్యాంగ్‌లో ఉన్న సంపంగి ప్రవీణ్‌.. వీరునాయక్‌కు లీక్‌ చేస్తున్నాడని హరీశ్‌ అనుమానించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ కూడా జరిగింది. విషయం తెలుసుకున్న భద్రునాయక్‌ ముందుగా ప్రవీణ్‌ని చంపాలని హరీశ్‌కు సూచించాడు. దీంతో జులై 13న ప్రవీణ్‌ ఇంటికి వెళ్లిన హరీశ్‌.. నెమ్మికల్‌లో దావత్‌ ఉందని తీసుకెళ్లాడు. అదే రోజు రాత్రి ఇద్దరూ మద్యం తాగి సూర్యాపేటలోని జక్కి సతీష్‌ సోదరుడు హరికృష్ణ గదికి వెళ్లారు. అక్కడే సతీష్‌, హరీశ్‌ కలిసి ప్రవీణ్‌ మెడకు బెల్టుతో గట్టిగా బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని కారు డిక్కీలో వేసుకొని అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామశివారులోకి తీసుకెళ్లి తలపై బండరాళ్లతో మోదారు. మృతదేహాన్ని వీడియోకాల్‌ ద్వారా భద్రునాయక్‌కు చూపించారు. శవాన్ని నీటి కుంటలో పారేశారు. చేయయటంతో భద్రునాయక్‌ రూ.20 వేలను తన కుమారుడి అకౌంట్‌ నుంచి హరీశ్‌కు పంపించాడు.

తరువాత హత్య ఘటన వెలుగులోకి వచ్చి హరీశ్‌.. పోలీసులకు చిక్కాడు. మొత్తం కుట్రను బయటపెట్టాడు. దీంతో శుక్రవారం భద్రునాయక్‌ సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ఇప్పటివరకు హరీశ్‌కు తన కుమారుడు, డ్రైవర్‌ అకౌంట్‌ నుంచి రూ.10 లక్షలు పంపించినట్లు భద్రునాయక్‌ చెప్పాడు.ప్రవీణ్ భార్య తన భర్త కనిపించటంలేదని పోలీసులకు ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. కేసు విచారించగా అసలు విషయం బయటపడింది.