మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చింది అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇళ్లలోకి దూరి మరీ కొట్టుకున్నారు

  • Published By: naveen ,Published On : August 28, 2020 / 10:42 AM IST
మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చింది అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇళ్లలోకి దూరి మరీ కొట్టుకున్నారు

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే శత్రువుల్లా చేస్తోంది. ప్రశాంతంగా ఉండాల్సిన గ్రామాల్లో, కలిసిమెలిసి తిరగాల్సిన గ్రామస్తుల్లో చిచ్చు రాజేస్తోంది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహపురం గ్రామంలో దారుణం జరిగింది.



మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చిందంటూ.. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇంటికి వెళ్లి మరీ దాడి చేశారు. మా ఇంటికొచ్చి కొడతారా అంటూ వాళ్లు కూడా దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నారు. పరస్పరం ఇళ్లలోకి చొరబడి మరీ కొట్టుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలు అయ్యాయి. ఇరు వర్గాల వారు చింతకాని పోలీస్ స్టేషన్ కు వెళ్లి పరస్పరం పిర్యాదులు చేసుకున్నారు. రెండు కులాలకు చెందిన ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం.. చినికి చినికి ఘర్షణకు దారితీసింది.
https://10tv.in/widow-woman-phc-man-shamed-paraded-in-up-village-residents-filmed-it/
కరోనాతో ఓ వ్యక్తి మృతి చెందగా నిన్న(ఆగస్టు 27,2020) కర్మ కార్యక్రమం జరిగింది. అక్కడికి మరో కులం వ్యక్తి వెళ్లాడు. కరోనా వచ్చిన వ్యక్తి బయటకు ఎందుకు వచ్చావు అని కోపంగా అనడం వాగ్వాదానికి దారితీసింది. మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చిందంటే.. కాదు.. మీ వారి వల్లే వచ్చిందని ఇద్దరి మధ్య మొదలైన వాగ్వాదం కొట్టుకునేందుకు దారితీసింది. కోపంతో మందిని కూడగట్టుకుని ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు. ఇది ఘర్షణకు దారి తీసింది. వీధుల్లోకి ఈడ్చుకుని వచ్చి మరీ కొట్టుకున్నారు. చివరికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో అంతా శాంతించారు. రంగంలోకి దిగిన పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.