Munugodu BY-Election : మునుగోడు ఉప ఎన్నికల బరిలో..ఏ పార్టీ నుంచి ఎవరు?

మునుగోడు విజయం.. ఇప్పుడు TRS,BJP, కాంగ్రెస్ పార్టీలకు చాలా కీలకంగా ఉంది. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. మునుగోడు ప్రజల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి.. ఏ పార్టీ తరఫున ఎవరు మునుగోడు బరిలో నిలవబోతున్నారు..?

Munugodu BY-Election : మునుగోడు ఉప ఎన్నికల బరిలో..ఏ పార్టీ నుంచి ఎవరు?

Munugodu BY-Election : మునుగోడు విజయం.. ఇప్పుడు మూడు పార్టీలకు చాలా కీలకమే. దీంతో నియోజకవర్గం చుట్టూ కనిపిస్తున్న రాజకీయ వ్యూహాలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకీ మునుగోడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతున్నాయ్. జనాల నుంచి వినిపిస్తున్న డిమాండ్లు ఏంటి.. ఏ పార్టీ తరఫున ఎవరు మునుగోడు బరిలో నిలవబోతున్నారు..

1967లో మునుగోడు అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికలు జరిగాయ్‌. 1967 నుంచి 1985వరకు వరుసగా నాలుగుసార్లు… ఆ తర్వాత 1999 నుంచి 2004వరకు కాంగ్రెస్ తరఫున పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 తర్వాత మునుగోడులో కాంగ్రెస్ గెలిచింది 2018లోనే ! 2004 నుంచి 2014 వరకు సీపీఐ తరఫున పల్లా వెంకట్‌, యాదరిగి రావు విజయం సాధించగా.. 2014లో టీఆర్ఎస్‌ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి గెలిచారు. మునుగోడుపై ముందు నుంచే దృష్టిసారించిన టీఆర్ఎస్‌.. సన్నాహాలు మొదలుపెట్టింది. మంత్రి జగదీష్‌ రెడ్డి ప్రత్యేక ఫోకస్‌తో సంస్థాగతంగా ఆ పార్టీ బలపడింది. బీజేపీ పలు ప్రాంతాలకే పరిమితం అయినా.. రాజగోపాల్‌ రెడ్డి అభ్యర్థిత్వం కమలానికి కలిసివచ్చేలా ఉంది.

రాజగోపాల్‌ రెడ్డి కమలం గూటికి చేరడం దాదాపు ఖాయం. దీంతో మునుగోడులో బీజేపీ అభ్యర్థిగా ఆయన పేరు దాదాపు ఖరారు అయినట్లే ! ఐతే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2018లో టీఆర్ఎస్‌ తరఫున ప్రభాకర్‌ రెడ్డి పోటీ చేయగా… మళ్లీ ఆయనకే అవకాశం ఇస్తారా లేదా అన్న దానిపై క్లారిటీ లేదు. ఈ ఉపఎన్నిక ప్రతిష్ఠాత్మకం కావడంతో.. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌గా ఉన్న గుత్తా సుఖేందర్‌రెడ్డిని బరిలోకి దించే ఆలోచన కూడా టీఆర్ఎస్ అధిష్టానం చేస్తుందన్న ప్రచారం నడుస్తోంది. జిల్లాలో సీనియర్‌ నేతగా ఉండడం.. ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఆయనకు కలిసివస్తాయని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. డెయిరీ కమిటీలకు ప్రాతినిధ్యం వహించిన గుత్తాకు.. మునుగోడు నియోజకవర్గంలో మంచి నెట్‌వర్క్‌ ఉంది. ఇక బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ఆ సామాజికవర్గం నేతకే అవకాశం ఇవ్వాలనుకుంటే.. కర్నాటి విద్యాసాగర్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ పేర్లు కూడా లెక్కలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయ్.

కాంగ్రెస్ కంచుకోటను కాపాడుకుంటుందా?
మునుగోడులో విజయం కాంగ్రెస్‌కు ఇప్పుడు చాలా కీలకం. కంచుకోట.. పైగా సిట్టింగ్ స్థానం.. అలాంటి చోట విజయం సాధించకపోతే.. తెలంగాణలో కాంగ్రెస్‌ పని అయిపోయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పైగా ఈ బైపోల్‌.. రేవంత్‌ రెడ్డి నాయకత్వానికి పరీక్ష అనే చెప్పాలి. దీంతో హస్తం పార్టీ ముందుగానే అలర్ట్ అయింది. మునుగోడు ఉపఎన్నిక కోసం ప్రత్యేకంగా కమిటీని నియమించి.. సీనియర్లకు అవకాశం కల్పించింది. విజయం కోసం అన్ని రకాల దారులు అన్వేషిస్తోంది. ఆ పార్టీ తరఫున కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతి పేరు అభ్యర్థి రేసులో వినిపిస్తోంది. ఇక బీసీ సామాజికవర్గం నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి పున్నా కైలాశ్ నేతతో పాటు.. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కూడా తెరమీదకు వస్తున్నాయ్. కాంగ్రెస్‌ పార్టీకి రాజగోపాల్‌ రెడ్డి వెన్నుపోటు పొడిచారని.. బుద్ది చెప్పేందుకు పార్టీ కేడర్ సిద్ధంగా ఉందని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు.

మునుగోడు నియోజకవర్గం హైదరాబాద్‌ దగ్గరలోనే ఉన్నా.. అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగలేదని స్థానికులు అంటున్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంతో పాటు నాంపల్లి, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపూర్ మండలాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయ్. ఫార్మాసిటీ, ఫిల్మ్ సిటీ ఏర్పాటు అంటూ గతంలో హడావుడి జరిగినా.. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.
ఇక పోడు భూముల సమస్యను స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయ్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మునుగోడు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు శివన్నగూడెం రిజర్వాయర్ చేపట్టినా.. ఆ పనులు పెద్దగా సాగడం లేదు. నిర్వాసితుల సమస్య ఇంకా అలానే ఉంది. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చాలాకాలంగా ఉన్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయ్.

దుబ్బాక, హుజూర్‌నగర్‌, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల పరిణామాలను గుర్తుచేసుకుంటున్న స్థానికులు.. ఉప ఎన్నిక వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఫీల్ అవుతున్నారు. మునుగోడులో అధికార పార్టీ అభిమానులు కూడా అదే వాదనను వినిపిస్తుండడం హైలైట్‌. ఐతే కాంగ్రెస్‌కు కంచుకోట అయిన మునుగోడు ఇప్పుడు మూడు పార్టీలకు కీలకంగా మారింది. కంచుకోటలాంటి స్థానాన్ని కోల్పోతే.. కాంగ్రెస్‌ భవిష్యత్‌ మీదే ప్రభావం చూపించే ప్రమాదం ఉంటుంది. అదే సమయంలో రాజీనామా తర్వాత రాజగోపాల్‌ రెడ్డి కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. బీజేపీది గెలిపించుకోవాల్సిన పరిస్థితి. దీంతో మునుగోడు ఎపిసోడ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది..